పుడమి తల్లికి మణిహారం : హరితహారం 4వ విడతకు అంతా రెడీ

NZతెలంగాణ మణిహారం… హరిత హారంకు రంగం సిద్దం అయ్యింది. వచ్చే వారంలో నాల్గవ విడత హరిత హారంను లాంచనంగా ప్రారంభించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు.. ప్రభుత్వం, అధికారులు ట్రైనింగ్ క్లాసులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నర్సరీలలో కోట్లాది మొక్కలు సిద్దం అయ్యాయి.

అటవీ విస్తీర్ణాన్ని 33శాతానికి పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏటా 40 కోట్ల మొక్కలతో… ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అటవీ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో 4 వేలకుపైగా నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాది గ్రామాల్లో కూడా నర్సరీలను ఏర్పాటు చేసి..పచ్చదనంతో పాటు ఉపాధిని కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నర్సరీలు ఏర్పాటు చేసేవారికి శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ ఏడాది అధికారికంగా హరితహారం కార్యక్రమం ప్రారంభం కాకపోయినా కొన్ని స్వచ్చంధ సంస్థలు, సినీనటులు ఇప్పటికే మొక్కలు నాటుతున్నారు.

జీవితా రాజశేఖర్ దంపతులు తమ కూతురు శివాని పుట్టినరోజు సందర్భంగా.. కండ్లకోయ ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ దగ్గర మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా నీడనిచ్చే మొక్కలతో పాటు పండ్లు, పూల మొక్కలు నాటుతున్నారు. అటవీ ప్రాంతం, రహదారులు, యూనివర్సిటీలు, ప్రభుత్వ ఆఫీసులు, పరిశ్రమలు.. ఇలా అన్ని చోట్ల మొక్కలు నాటి.. పచ్చదనాన్ని పెంచుతున్నారు. నాటిన మొక్కలు కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్షాలు పడకపోయినా రోజూ నీళ్లుపోసి.. వాటిని బతికించే ప్రయత్నం చేస్తున్నారు.

వ్యవసాయ భూముల్లో నాటే మొక్కలను పెంచేందుకు అయ్యే ఖర్చులు కూడా ఇస్తున్నామంటున్నారు అధికారులు. 5 ఎకరాల్లో 8 వందల మొక్కలు నాటి.. వాటిని పెంచితే.. రైతుకు నెలకు నాలుగువేలు ఇస్తున్నారు.  గత రెండేళ్ళుగా హరిత హారం మంచి ఫలితాలు సాధించిందంటున్నారు అటవీ శాఖ అధికారులు. ఈ ఏడాది వర్షాలు పడితే మొక్కల పెంపకం ముమ్మరంగా కొనసాగుతుందని అంటున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates