పుత్తడికి చిరునామా : హైదరాబాద్‌ లో గోల్డ్ సెజ్

రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో బంగారం ధర అగ్గువ అవుతుందటా… ఇక్కడి నుంచే దేశ విదేశాలకు ఎగుమతి కానుందటా… ఒక్క మాటలో చెప్పాలంటే, పుత్తడికి హైదరాబాద్‌ చిరునామాగా మారనుంది. ఇందుకు కారణం… బంగారాన్ని శుద్ధి చేసే ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఐటీ, వైమానిక, రక్షణ రంగాలకు ప్రసిద్ధి గాంచింది హైదరాబాద్ నగరం. వాటి ఉత్పత్తుల్లో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. హాంకాంగ్‌కు చెందిన అంతర్జాతీయ బంగారం రిఫైనరీ సంస్థ హంటన్‌ గ్రూప్‌ కొంగరకలాన్‌లో శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. హంటన్‌ గ్రూపునకు అవసరమైన 25 ఎకరాల భూమిని కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ ఏర్పాటు చేయనున్న సెజ్‌లో రెండు విడతలుగా సదరు సంస్థ రూ.1300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

ఇందులో తొలి విడత రూ.550 కోట్లు, రెండో విడత రూ.750 కోట్లు పెట్టుబడులు రానున్నాయి. ఈ సెజ్‌ లో బంగారం శుద్ధి ప్లాంటుతోపాటు వెండి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనుంది ఈ సంస్థ. తొలి దశలో ఏటా 30 టన్నుల బంగారం, 100 టన్నుల వెండి శుద్ధి లక్ష్యంతో ప్లాంటును నిర్మించనుంది. రెండో దశలో 50 టన్నుల బంగారం, 150 టన్నుల వెండి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం దేశంలోని హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇలాంటి సెజ్‌ ఉంది. హైదరాబాద్‌ సెజ్‌ దేశంలో రెండోది అవుతుంది. హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసే ప్లాంట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ కంటే చాలా పెద్దవని తెలిపారు అధికారులు. హైదరాబాద్‌ గోల్డ్‌ సెజ్‌కు బంగారం ముడి సరుకు దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి కానుంది. ముడి సరుకు అంటే బంగారం ఖనిజాన్ని ఇక్కడికి తీసుకురారు. అక్కడ కొంత శుద్ధి చేసిన బంగారాన్ని ఇక్కడకు తెస్తారు. దానిని ఇక్కడ మళ్లీ శుద్ధి చేస్తే 80 శాతం బంగారం వస్తుందని అధికార వర్గాలు చెప్పాయి.

వాటితో బంగారు బిస్కెట్లు, బార్లు తదితరాలను తయారు చేస్తారని వివరించాయి. నగల తయారీ యూనిట్లను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తారు.ఈ బంగారం, నగలను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ లో విక్రయిస్తారు. ముడి సరుకును కార్గో విమానాల ద్వారా దిగుమతి చేసుకోవాల్సి ఉన్నందున ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌ ను ఈ సంస్థ ఎంపిక చేసుకుంది. శంషాబాద్‌ విమానాశ్రయానికి అతి సమీపంలో అంటే 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉంది. ముడి సరుకు దిగుమతితోపాటు శుద్ధి చేసిన బంగారాన్ని దేశ, విదేశాలకు తరలించేందుకు ఈ ప్రాంతం అనువుగా ఉంటుంది. దీనితోపాటు భారత్‌కే చెందిన బియానీ గ్రూప్‌ కూడా తెలంగాణలో బంగారం శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. ఇవి రెండూ కలిసి రెండు రిఫైనరీలను ఏర్పాటు చేయనున్నాయి.

బంగారాన్ని తెలంగాణలోనే శుద్ధి చేస్తారు. తత్ఫలితంగా దేశంలోని ఇతర మెట్రో సిటీల కంటే హైదరాబాద్‌ లో బంగారం అగ్వకు దొరికే అవకాశం ఉంది. సదరు సంస్థకు అన్ని అనుమతులు ఉండడంతో హైదరాబాద్‌ లో బంగారం అమ్ముకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇతర ప్రాంతాలకు అయితే రవాణా చార్జీలతో కలిపి విక్రయించాల్సి ఉంటుంది. ఇక్కడ రవాణా చార్జీల ప్రభావం ఉండదు కనక ధర తక్కువ ఉండే అవకాశం ఉందని చెపుతున్నారు అధికారులు.

 

 

Posted in Uncategorized

Latest Updates