పెట్రోల్ మంటలు : వరస బాదుడుతో వాహనదారులు బెంబేలు

petrol

ఎంత దారుణం.. ఎంత దారుణం.. రోజూ ఏదో 2, 3, 4పైసల చొప్పున పెరుగుతుంది అంటే పర్వాలేదు అని లైట్ తీసుకున్నారు. కర్నాటక ఎన్నికల క్రమంలో 19 రోజులు మార్పుకి బ్రేక్ పడింది. పోలింగ్ ముగిసిందో లేదో వెంటనే పెంపు మొదలైంది. అది ఎలా అంటే.. ప్రతి రోజూ 15పైసలు తగ్గకుండా ఉంటుంది. మూడు రోజుల్లోనే లీటర్ పెట్రోల్ పై 50పైసలు, డీజిల్ పై 50పైసలు పెరిగింది. అంటే ఈ 19 రోజుల్లో పెంచాల్సిన ధర అంతా కూడా ఇప్పుడు పెంచేస్తున్నారు.

కర్నాటక ఎన్నికల క్రమంలో 19 రోజుల్లో పెంచని ఇంధన ధరల కారణంగా ఆయిల్ కంపెనీలు రూ.500 కోట్లు నష్టపోయాయి. ఈ మొత్తాన్ని రికవరీ చేసుకోవటానికి ఇప్పుడు బాదుడు మొదలుపెట్టాయి. ఒకేసారి రెండు, మూడు రూపాయలు పెంచితే నిరసనలు వస్తాయని భావించిన కంపెనీలు.. ప్రతి రోజూ 15 నుంచి 20పైసల వరకు పెంచుతూ ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో మూడు రోజులగా చూస్తే.. మొదటి రోజు 19పైసలు, రెండో రోజు 16పైసలు, మూడో రోజు 16పైసలు పెంచారు. అంటే ఒక్క పెట్రోల్ పైనే మూడు రోజుల్లో 51పైసల ధర పెరిగింది. ఇక డీజిల్ పై మొదటి రోజు 26పైసలు, రెండో రోజు 24పైసలు, మూడో రోజు 23పైసలు పెంచారు. అంటే మూడు రోజుల్లోనే 73పైసలు పెరిగింది.

మరో వారం రోజులు ఇదే రేంజ్ లో ధరలు పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అంటే హైదరాబాద్ లో ఈ వారంలోనే లీటర్ పెట్రోల్ 80 రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.79.55, డీజిల్ రూ.72.36 చేరుకుంది. ఆయా ప్రాంతాలను బట్టి రెండు, మూడు పైసలు అటూ ఇటూ ఉంటుంది ధర.

 

Posted in Uncategorized

Latest Updates