పెరుగుతున్న క్రైం : దోషులుగా రుజువు చేయలేకపోతున్నారు

హైదరాబాద్ క్రైం కేసుల్లో నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారు. కోర్టుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేసినా.. రుజువు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. వంద కేసుల్లో 30 కేసులు కూడా ప్రూవ్ చేయడం లేదు. కోర్టుల్లో సరైన ఆధారాలు చూపించకపోవడంతో.. దోషులంతా.. నిర్ధోషులుగా బయట తిరుగుతున్నారు.

ఆధునిక టెక్నాలజీ సాయంతో హైదరాబాద్ లో క్రైమ్ రేట్ తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసు శాఖ … నేరాలకు పాల్పడిన నిందితులకు జైలు శిక్ష పడేలా చేయడంలో విఫలమవుతుందన్న విమర్శలున్నాయి. కష్టపడి నిందితులను పట్టుకుంటున్నా.. వాళ్లను కోర్టులో దోషులుగా రుజువు చేయలేకపోతోంది. క్రైం రికార్డుల ప్రకారం  సిటీలో ఏటా నమోదవుతున్న కేసుల్లో  వందకు  70  మంది నిర్దోషులుగా జైలు నుంచి బయటకు వస్తున్నారు.

2015లో  21వేల 285 కేసులు నమోదు అయ్యాయి.  వీటిలో 7వేల 512 కేసుల్లో కోర్టుల్లో ఛార్జీషిట్లు దాఖలు చేశారు. ఇందులో 6వేల 49 మంది నిర్ధోషులుగా బయటకు వచ్చారు.  1463 మందికి శిక్ష పడింది. 2016లో 18వేల 869 కేసులు బుక్ అయితే.. 5వేల 848 కేసుల్లో ఛార్జిషీట్ వేశారు. వీటిలో 4వేల 442 మంది నిర్దోషులుగా తేల్చింది కోర్టు. 2017లో  17వేల 403 కేసులు నమోదు చేశారు. వీటిలో 3వేల 688 కేసుల్లో కోర్టుల్లో ఛార్జీషీట్ వేశారు. దీంట్లో  969 మందికి మాత్రమే శిక్ష పడింది.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వంద కేసుల్లో కేవలం 30 కేసుల్లోనే శిక్షలు పడ్డాయి. .. తీవ్రమైన నేరాల్లో వందకు  8 కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయి. కొంత మంది పోలీసులు న్యాయ విచారణలో మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.  కొన్ని సందర్బాల్లో పోలీసులే.. నిందితులకు సహకరిస్తున్నారని ఆరోపణలున్నాయి.  పరిస్థితి ఇలాగే కొనసాగితే  నేరాలు పెరిగే అవకాశం ఉందంటున్నారు లాయర్లు.

ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ ను కోర్టు పనుల కోసమే ఉపయోగిస్తున్నారు. ఏళ్ల తరబడిగా ఒకే కానిస్టేబుల్ పని చేస్తుండటంతో నిందితులు.. ఆయనతో సన్నిహిత్యం ఏర్పరచుకొని.. రాజీ కుదుర్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శిక్షలు పడకపోవడానికి  ఇది ఓ కారణంగా చెబుతున్నారు. తప్పు ఎవరూ చేసినా.. శిక్ష పడేలా పోలీసులు ప్రయత్నించాలంటున్నారు జనం.

Posted in Uncategorized

Latest Updates