పెరుగుతున్న చెక్ బౌన్స్ కేసులు : పరిష్కారానికి చట్టంలో కీలక మార్పులు

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు పెరుగుతున్న బ్యాంకు చెక్కులకు ఉన్న ప్రాధాన్యం తగ్గడం లేదు. కోర్టుల్లో పెరిగిపోతున్న చెక్‌ బౌన్స్‌ కేసులే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో 45 లక్షల వరకు చెక్‌ బౌన్స్‌ కేసులున్నాయని అంచనా. ఒక చెక్‌ బౌన్స్‌ కేసు పరిష్కారం కావడానికి సగటున నాలుగేళ్లు పడుతుందని ఓ సర్వేలో వెల్లడైంది. కేసుల పరిష్కారానికి సుదీర్ఘ సమయం పడుతుండటం బాధితుడికి సరైన ప్రయోజనం లభించడం లేదు. దీంతో నెగోషిబుల్‌ ఇన్‌స్ట్రుమెంటల్‌ యాక్ట్‌ 1881కి కీలక సవరణలు చేశారు.
చెక్కు తీసుకున్న వారి హక్కులు పరిరక్షించేలా నెగోషిబుల్‌ ఇన్‌స్ట్రుమెంటల్‌ యాక్ట్‌లో సెక్షన్‌ 143ఏ వచ్చి చేరింది. ప్రస్తుత చట్టంలోని సెక్షన్‌ 138 ప్రకారం చెక్‌బౌన్స్‌ కేసులను క్రిమినల్‌ నేరంగా భావించి గరిష్టంగా రెండేళ్ల వరకు జైళ్లు శిక్ష విధించే అవకాశం ఉంది. కానీ కేసు తేలే వరకూ బాధితుడికి ఒక్క పైసా కూడా రావడం లేదు. కింది కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చినా.. పై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. దీనివల్ల చెక్‌ తీసుకున్న వాళ్లు సరుకులు, డబ్బులు ఇచ్చి అవి తిరిగిరాక ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తోంది. దీనిని అరికట్టడానికే ప్రస్తుతం ఉన్న చట్టంలో మూడు కీలక మార్పులు చేశారు.

మధ్యంతర పరిహారం

చెక్‌ బౌన్స్‌ అయ్యిందంటూ కోర్టుకు వెళితే తక్షణమే మధ్యంతర పరిహారం ఇచ్చే హక్కులను సెక్షన్‌ 143ఏ కల్పిస్తోంది. దీని ప్రకారం చెక్‌ ఇచ్చిన మొత్తంలో 20 శాతం వరకు బాధితుడికి చెల్లించేలా కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీచేయవచ్చు. ఈ మొత్తాన్ని 60 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది.

అప్పీల్‌కి వెళితే 20 శాతం డిపాజిట్‌ చేయాలి

ఒక వేళ కింది కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని చెక్‌ ఇచ్చిన వ్యక్తి భావించి పై కోర్టులో సవాల్‌ చేయాలంటే.. కింది కోర్టు తీర్పు ఇచ్చిన నష్టపరిహారంలో 20 శాతం మొత్తాన్ని బాధితుడికి చెల్లించాల్సి ఉంటుంది.

ఓడిపోతే వడ్డీతో సహా చెల్లించాలి

ఒకవేళ చెక్‌ బౌన్స్‌ అయ్యిందంటూ కోర్టుకెళ్లిన వ్యక్తి సహేతుక కారణాలు చూపించలేకపోతే.. డిపాజిట్‌ చేసిన మొత్తంపై వడ్డీతో సహా చెక్‌ ఇచ్చిన వారికి చెల్లించాల్సి ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates