పెళ్లింట్లో విషాదం: గ్యాస్ పేలి 9మంది సజీవ దహనం

FIREపెళ్లితో ఆ ఇంట్లో బంధువుల సందడి అంతా ఇంతా కాదు. అంతలోనే ఆ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వంట గ్యాస్ సిలిండర్ పేలి తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలోని బీవార్‌లో ఓ పెళ్లింట్లో శనివారం(ఫిబ్రవరి-17) జరిగింది. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. భోజనాలు చేస్తున్న సమయంలో సిలిండర్‌ దగ్గర నిర్లక్ష్యంగా పనిచేయడంతో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. దాని పక్కనే ఉన్న మరో సిలిండర్‌ ఉండటంతో అది కూడా పేలి.. ప్రమాద తీవ్రత పెరిగింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

పేలుడుకు పక్కనే ఉన్న రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంటి ఎదుట పార్క్ చేసిన రెండు కార్లు కూడా పేలుడు ధాటికి ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే పనిలో సహాయక సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates