పెళ్లికి వధువు అంగీకారం తప్పనిసరి : సుప్రీం

SUPREME COURTమ్యారేజ్ కి పెళ్లి కూతురి అంగీకారం తప్పనిసరి అని తెలిపింది సుప్రీంకోర్టు. వధువుకి ఇష్టం లేకుండా, మోసపూరితంగా జరిగిన హిందూ వివాహాం చట్టరీత్యా చెల్లదని చెప్పింది. కర్ణాటకకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుని కుమార్తె పెట్టుకున్న రిట్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా- బుధవారం (ఏప్రిల్-11) ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. కర్ణాటక రాజకీయ నాయకుని కుమార్తె ఒకరు తనకు ఇష్టంలేని పెళ్లి చేశారనీ, రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్ర, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌ల ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున ఇందిరా జైసింగ్‌, సునీల్‌ ఫెర్నాండెజ్‌ లు వాదనలు వినిపిస్తూ- వివాహానికి వధువు అంగీకారం తప్పనిసరి అన్న స్పష్టమైన నిబంధన హిందూ వివాహచట్టంలో లేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. జస్టిస్‌ మిశ్రా స్పందిస్తూ- అమ్మాయి అంగీకారం లేకుండా, మోసపూరితంగా జరిగే పెళ్లి హిందూ వివాహచట్టం ప్రకారం చెల్లుబాటుకాదన్నారు. పెళ్లి కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే.. అది ఆ పెళ్లి రద్దుకు కూడా దారితీస్తుంది. మోసం చేసి పెళ్లి చేసినా ఇదే వర్తిస్తుంది అని బెంచ్‌ స్పష్టం చేసింది. మళ్లీ చట్టబద్ధంగా చెల్లదని న్యాయస్థానం ప్రకటించాల్సిన అవసరంలేదు అని చెప్పారు జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ఖన్విల్కర్‌ లు. ఇలాంటి బాధిత మహిళలు తగుచర్యల నిమిత్తం సివిల్‌ కోర్టులను ఆశ్రయించాలనీ, న్యాయ ప్రక్రియను అనుసరించి సదరు న్యాయస్థానాలు వివాహ రద్దుపై నిర్ణయం తీసుకుంటాయని సూచించారు. పిటిషనర్‌కు రక్షణ కల్పించాలని పోలీసులను ధర్మాసనం ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.

Posted in Uncategorized

Latest Updates