పేరుకే పెద్దాసుపత్రి : నల్గొండ ఆస్పత్రిలో ఉండాలంటేనే భయపడుతున్న జనం

పేరుకు పెద్దాసుపత్రి.  కానీ.. చిన్న చిన్న రోగాలకే అక్కడ వైద్యం అందుతోంది. పెద్ద జబ్బులు చేస్తే… ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్ళాల్సిందే. లక్షలు ఖర్చుచేసి వైద్య పరికరాలు కొన్నా.. వాటిని అపరేట్ చేసే సిబ్బంది లేరు. దీంతో అవి నిరుపయోగంగా మూలన పడ్డాయి. కొందరు డాక్టర్లు ప్రైవేటు క్లినిక్స్ కే ప్రాధాన్యత ఇవ్వడంతో పేదలకు సరైన ట్రీట్ మెంట్ అందటంలేదన్న ఆరోపణలున్నాయి.

నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ప్రతిరోజూ చికిత్స కోసం వందలాదిగా వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ హాస్పిటల్ లో  3వందల బెడ్స్ ఉన్నా…  డాక్టర్ల కొరతతో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. రేడియాలజీ, సిటీస్కాన్ ఉన్నా లేనట్లే. డయాలసిస్ సెంటర్ ది అదే పరిస్థితి.

జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మందుల కొరత ఉంది. ఇక బాత్ రూంలు, టాయిలెట్స్ ల నుంచి దుర్వాసన వస్తుండటంతో.. ఇక్కడ ఉండాలంటేనే రోగులు భయపడుతున్నారు. ఈ దవాఖానాకు ఎక్కువగా గర్భిణీలు వస్తుంటారు. OP ఆన్ లైన్ చేసినా సరైన సిబ్బంది లేక ఇంకా చిట్టీలతోనే కాలం గడుపుతున్నారు. ఎక్కువ మంది రోగులు వచ్చినపుడు ఇబ్బందులు తప్పటంలేదు. ఉన్న బెడ్స్ కూడా సరిగా లేకపోవటంతో.. నేలపై పడుకొని వైద్యం చేయించుకుంటున్నారు. సరిపోను వైద్య సిబ్బంది లేకపోవటంతో పేషెంట్లకు పూర్తిస్థాయిలో చికిత్స అందటంలేదు.

ఈ దవాఖానాలో స్కానింగ్ మిషిన్  పనిచేయడం లేదు. అత్యవసరం ఉంటే ఎదురుగా ఉన్న ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు పంపిస్తున్నారు. రోగులకు సరిపడా మందులు ఇవ్వకపోవటంతో.. బయట కొనాల్సిన దుస్థితి. వైద్యుల ఓవైపు డాక్టర్ల కొరత వేధిస్తుంటే.. ఉన్న డాక్టర్లకు కూడా దవాఖానా సమీపంలోనే ప్రైవేటు క్లినిక్స్  నడుపుతున్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రైవేటు క్లినిక్స్ ఏర్పాటు చేయటంపై రోగులు మండిపడుతున్నారు.

చేసే ప్రతి పనికి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గర్భిణీల విషయంలో  ఒక్కో సేవకు ఒక్కో రేటు ఉందంటున్నారు పేషెంట్ల బంధువులు. డబ్బులు ఇవ్వనివారిని చిన్నచూపు చూస్తున్నారంటున్నారు.  మరుగుదొడ్ల నుంచి వచ్చే కంపుతో కొత్త రోగాలు వస్తున్నాయంటున్నారు. ప్యాన్ లు ఉన్నా అవి పనిచేయటంలేదని చెబుతున్నారు రోగుల బంధువులు.

ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించిన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్.. ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు లెటర్లు రాశారు. ప్రస్తుతం జిల్లాకు మెడికల్ కాలేజీ రావటంతో.. భూమి నిర్ణయం అయ్యేవరకు దవాఖానాలో కొత్తగా నిర్మించిన భవనాల్లో ప్రారంభం చేయనున్నారు. ఇటీవల ఆస్పత్రిలో సమస్యలను మంత్రులు జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కంచర్ల భూపాల్ రెడ్డి, బెడ్స్ పెంచాలని, సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందేలా ఉద్యతాధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు జనం.

 

Posted in Uncategorized

Latest Updates