పేరుకే బిల్ కలెక్టర్ : ఆస్తుల్లో కింగ్

GNT BILL COLLECTORఅతడు ఓ సాధారణ బిల్ కలెక్టర్. కానీ ఆదాయంలో మాత్రం కింగ్. అక్రమంగా సంపాదించిన ఆస్తులు బట్టబయలు కావడంతో ACB అధికారులే ఆశ్చర్యపోయారు. ఏపీలోని గుంటూరు నగరపాలక సంస్థలో బిల్ కలెక్టర్ ముద్రబోయిన మాధవ్ అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు. మాధవ్‌ కు చెందిన నివాసాల్లో గుంటూరులో ఏడుచోట్ల, మాచవరం మండలంలో రెండుచోట్ల, ఇతర ప్రాంతాల్లో అవినీతి, నిరోధకశాఖ అధికారులు బుధవారం (మే-30) ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

సోదాల్లో రూ.50 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. వీటి మార్కెట్ విలువ రూ.80 కోట్లపైనే ఉంటుందని చెప్పారు ACB డీఎస్పీ దేవానంద్.  2011లో తన తండ్రి మరణానంతరం కారుణ్య నియామకంలో గుంటూరు నగరపాలక సంస్థలో బిల్ కలెక్టర్‌ గా రెవెన్యూ సెక్షన్‌ లో చేరాడు మాధవ్.  ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో గుంటూరు, విజయవాడ, ఒంగోలు, రాజమండ్రికి చెందిన ఎనిమిది మంది ACB అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. 20 ప్రాంతాల్లో ఇంటి స్థలాలు గుర్తించామని, నాలుగు ఇండ్లు సీజ్ చేశామని, ఒక కారు, ఏడు లక్షల నగదు లభించిందని వివరించారు DSP దేవానంద్. బంగారం రెండువందల గ్రాములు ఉన్నట్టు గుర్తించగా, వెండి ఆభరణాలు భారీగా దొరికాయని, వీటి విలువను లెక్కిస్తున్నామని చెప్పారు ACB అధికారులు.

 

Posted in Uncategorized

Latest Updates