పైలెట్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం : ల్యాండింగ్ సమయంలో పేలిన విమానం టైర్

బుధవారం(మార్చి28) రాత్రి శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో ఫ్లైట్ కి పెద్ద ప్రమాదం తప్పింది. రాత్రి 9 గంటల 40 గంటలకు ల్యాండ్‌ అవ్వాల్సిన విమానం ఆలస్యంగా 10 గంటల 2 నిమిషాలకు ల్యాండ్‌ అవుతున్న సమయంలో విమానం టైరు పేలి ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగడంతో ఏం జరుగుతుందో అర్ధంకాక విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
70 మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానం రన్‌వేపై దిగుతున్న సమయంలో ఒక్కసారిగా టైర్‌ పేలింది. టైర్‌ నుంచి నిప్పురవ్వలు లేచి మంటలంటుకున్నాయి. . పైలట్ అప్రమత్తతతో వ్యవహరించి విమానాన్ని అదుపులోకి తేవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పేశారు. ఈ ప్రయాణికులలో MLA రోజా కూడా ఉన్నారు. ఫైరింజన్లు మంటలు ఆర్పిన తర్వాత కూడా కొద్దిసేపు విమానం తలుపులు తెరవలేదు. విమానం దగ్గర్లోకి ఎవ్వరిని వెళ్లనివ్వలేదు. చాలాసేపు తలుపులు తెరవకపోవడంతో విమానం లోపలే ఆందోళనకు దిగారు ప్రయాణికులు. కొద్దిసేపటి తరువాత విమానం తలుపులు తెరవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో ఆ రన్ వేపై దిగాల్సిన రెండు విమానాలను అధికారులు దారి మళ్లించారు.

Posted in Uncategorized

Latest Updates