పొగలు చిమ్మే సరస్సు : టూరిస్టులు తెలుసుకోవాల్సిందే

చలికాలంలో సరదాగా బయటి ప్రదేశాలు చూడాలని చాలామంది అనుకుంటారు. అలాంటి వాళ్లు ఫ్రయింగ్‌ పాన్‌ సరస్సు గురించి తెలుసుకోవాల్సిందే. న్యూజిలాండ్‌ లోని వైమాంగూలో ఉంది ఈ సరస్సు. ఎప్పుడూ పొగలు కక్కుతూ పర్యాటకులను ఆకర్షిస్తుంది.

రిఫ్ట్‌ లోయలో ఉన్న ఈ సరస్సు.. 1886లో మౌంట్‌ తారావెరా అగ్నిపర్వతం బద్ధలు కావడంతో ఏర్పడింది. 200 మీటర్ల విస్తీర్ణం, దాదాపు ఆరు మీటర్ల లోతు ఉంటుంది. ప్రపంచంలోని అతి
పెద్ద వేడినీటి సరస్సుల్లో ఇదీ ఒకటి. ఇక్కడికి వెళ్లి.. అక్కడి ప్రకృతి అందాలను కెమెరాలో మాత్రమే బంధించొచ్చు.  కానీ, నీళ్లలోకి దిగి.. ఎంజాయ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే.. సంవత్సరం పొడవునా ఈ సరస్సులోని నీరు 50 నుం చి 60 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో ఉంటాయి. ఒక్కోసారి ఏకంగా 74 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది.

అగ్నిపర్వతం పేలినప్పుడు ఆ ప్రాంతంలో 17 కిలోమీటర్ల మేర అక్కడక్కడా చిన్న చిన్న బిలాలు ఏర్పడ్డాయి. వేడిగా ఉన్న ఆ బిలాల్లోకి వర్షపు నీరు చేరింది. దాంతో అక్కడ భూగర్భజలం కూడా వేడిగా ఉండి.. వేడినీటి బుగ్గలు ఏర్పడ్డాయి. కార్బన్‌ డై ఆక్సైడ్‌, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వాయువులు ఆ రంధ్రాల నుంచి పైకి ఎగజిమ్ముతూ ఉంటాయి. ఈ నీటిలో ఎలాంటి జీవరాశులు కనిపించవు.

Posted in Uncategorized

Latest Updates