పొలాల్లో జనాన్ని పరుగెత్తించిన చిరుత.. ఐదుగురికి గాయాలు

వ్యవసాయ పొలాల్లోకి వచ్చిన చిరుతపులిని  చూసేందుకు వచ్చిన జనం.. ఆ చిరుత దాడిలోనే గాయపడిన సంఘటన తమిళనాడులో జరిగింది. వాణీయంబాడీ పట్టణం.. చిక్కనాకుప్పం గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లోకి ఈ ఉదయం చిరుతపులి వచ్చింది. గుంపులుగా అక్కడ జనంపై చిరుత ఒక్కసారిగా దాడిచేసింది. దూరంగా నిలబడి ఉన్న వారివైపు దూసుకెళ్లింది. దీంతో.. ఒక్కసారిగా జనం అరుస్తూ… పరుగెత్తారు.

అలాగే వెంటాడిన చిరుతపులి… పరుగెడుతున్న జనంపై దాడి చేసింది. వారిపై దూకి గాయపరిచింది. ఆ తర్వాత అక్కడినుంచి కొండ ప్రాంతంవైపు వెళ్లింది. చిరుత దాడిలో ఐదుగురు గాయపడ్డారు. వీరిని వాణీయంబాడీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలానికి పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది చేరుకున్నారు. చిరుత పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల పొలాల్లోకి చిరుత వస్తున్న సంఘటనలు తరచుగా జరగడం.. తాజాగా మనుషులపైనే దాడిచేయడంతో.. స్థానికులు భయంతో వణికిపోతున్నారు. రాత్రివేళ ఎక్కడ ఊళ్లమీద పడుతుందో అని టెన్షన్ పడుతున్నారు. చిరుతపులిని పట్టుకునేందుకు 20 మంది అటవీ సిబ్బందిని నియమించినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇందుకోసం మత్తు ఇంజెక్షన్లు, వలలు, బోన్లు సిద్ధం చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates