పొలిటికల్ యాక్సిడెంట్..! మన్మోహన్ సింగ్ సినిమా ట్రైలర్ వివాదం

‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ మూవీ ట్రైలర్ రాజకీయ వివాదాలు రేపుతోంది. టైటిల్ ప్రకటించినప్పటినుంచీ ఈ సినిమాపై అటు రాజకీయ వర్గాల్లో ఇటు సినీ ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ అయి ఉంది. లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ అంతటా హాట్ టాపిక్ గా మారింది.

మన్మోహన్ సింగ్ ను తమ రాజకీయ వారసత్వ అవసరాల కోసం ప్రధాని పదవిలో సోనియాగాంధీ కూర్చోబెట్టినట్టుగా సినిమాలో చూపించారని విమర్శలు వస్తున్నాయి. యూపీఏ హయాంలో కేంద్రం సాధించిన విజయాలు కాంగ్రెస్ ఖాతాలోకి… పరాజయాలు, వైఫల్యాలు మన్మోహన్ సింగ్ ఖాతాలోకి వెళ్లినట్టుగా అందులో ఉందని కొందరు అంటున్నారు. ఈ సంగతులు తెల్సుకుని పదవికి రాజీనామా చేయాలని మన్మోహన్ సింగ్ అనుకున్నా… రాహుల్ కోసం పదవిలో కొనసాగాలని సోనియాగాంధీ ఒత్తిడి చేసినట్టుగా తీశారని విమర్శిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్ ను బీజేపీ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం పెద్ద దుమారానికి కారణమవుతోంది. రాహుల్ కోసం మన్మోహన్ కు పదవి ఇచ్చి.. పదేళ్లపాటు దేశ ప్రధాని పదవినే వాడుకుందని ఆరోపించింది. తమ రాజకీయ వారసుడి కోసం ఓ ప్రభుత్వ ప్రతినిధిగా మాత్రమే మన్మోహన్ సింగ్ ను అత్యంత కీలకమైన ప్రధాని పదవిలో కూర్చోబెట్టిన ఘనత కాంగ్రెస్ ది అంటూ బీజేపీ విమర్శించింది. మరోవైపు… బీజేపీ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొడుతోంది. సినిమాను తమకు చూపించిన తర్వాతే విడుదల చేయాలని మూవీ మేకర్స్ కు షరతులు పెట్టింది. ఈ సినిమాతో పార్లమెంట్ ఎన్నికల వేడి పెరిగేలా కనిపిస్తోంది.

ప్రధాని సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జనవరి 11న ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమా విడుదల కాబోతోంది.

 

Posted in Uncategorized

Latest Updates