పోలవరం పురోగతిపై… అధికారుల్ని ప్రశంసించిన గడ్కరీ

పోలవరం నిర్మాణ పనుల పురోగతిపై కేంద్ర మంత్రి గడ్కరీ… అధికారుల్ని ప్రశంసించారు. స్పిల్ వే పనులను సీఎం చంద్రబాబుతో కలిసి గడ్కరీ పరిశీలించారు. అద్భుతమైన పురోగతి సాధించారన్న కేంద్రమంత్రి…. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రాజకీయాలు.. ప్రాజెక్టుల అభివృద్ధి రెండు వేర్వేరు అన్నారు కేంద్రమంత్రి.
కేంద్రమంత్రి నితిన్ గడ్కర్, ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటించారు. పోలవరం స్పిల్ వే పనులను పరిశీలించారు. పనుల పురోగతిని గడ్కరీకి చంద్రబాబు వివరించారు. ఫిబ్రవరి నాటికి కాంక్రీట్ పనులు పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే జెట్ గ్రౌంటింగ్ పనులను పూర్తి చేస్తామని కేంధ్రమంత్రికి అధికారులు వివరించారు.
మట్టి పనులు, పునరావాసం కోసం నిధులు ఇవ్వడానికి కేంద్ర ఆర్థికశాఖ అనుమతి అవసరమన్నారు గడ్కరీ. పునరావాసంలో గిరిజనులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబును సూచించారు. పోలవరాన్ని పూర్తి చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ కట్టుబడి ఉన్నారని గడ్కరీ అన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తన పర్యటన కొంతకాలం ఆలస్యమైందన్నారు కేంద్రమంత్రి.

2019 టార్గెట్ గా పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు కీలక పనులన్నీ పూర్తి చేసేలా ప్లాన్ చేశామన్నారు. పనుల పురోగతిపై అధికారులతో గడ్కరీ సమక్షంలో సమీక్షించారు చంద్రబాబు. దాదాపు పది నెలల తర్వాత గడ్కరీ రెండో సారి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. కేంద్రమంత్రి గడ్కరీని కలిసేందుకు హెలిప్యాడ్ వద్దకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అనుమతించలేదు. పాస్ లు ఉన్నవారిని మాత్రమే పంపుతామన్న పోలీసులతో… వాగ్వాదానికి దిగారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.

Posted in Uncategorized

Latest Updates