పోలియో చుక్కలు సురక్షితం.. వదంతులు నమ్మొద్దన్న కేంద్రం

ఢిల్లీ : దేశమంతటా ఐదేళ్ల లోపు చిన్నపిల్లలకు రెగ్యులర్ గా ఇచ్చే పోలియో చుక్కలు అత్యంత సురక్షితమైనవని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. పిల్లలు ఆరోగ్యంగా ఎదగడటానికి అవి చాలా అవసరమని తెలిపింది. వ్యాక్సిన్లు కొన్ని దశాబ్దాలుగా పిల్లల్లో వైకల్యాన్ని తగ్గిస్తూ వస్తున్నాయని.. అవి కొనసాగించాల్సిన అవసరం చాలా ఉందని సూచించింది. పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని విజ్ఞప్తిచేసింది. పోలియో చుక్కలు కలుషితమైనవి… వాటితో పిల్లలకు హాని జరుగుతుందంటూ జరుగుతున్న ప్రచారం అంతా వదంతులే అని కొట్టిపారేసింది. ఎటువంటి ఆధారం లేని అటువంటి ప్రచారాన్ని నమ్మొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ ట్విట్టర్ లో తెలిపింది.

” రేపు 5 సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలకి పోలియో ఇవ్వొద్దు.. దాంట్లొ వైరస్ కలిసిందంటా. .పోలియోని తయారు చేసిన ఆ కంపెని యజమానిని అరెస్ట్ చేసారు.. దయచేసి అందరికి చెప్పగలరు..” ఈ మెసేజ్… గత కొన్ని రోజులుగావాట్సాప్‌, ఫేస్‌బుక్ లలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సోషల్ మీడియా మెసేజ్‌ల కారణంగా.. పిల్లలకు పోలియో చుక్కలు వేయిద్దామనుకున్న తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాక ఆందోళన పడ్డారు. వైరల్ గా మారిన ఈ వదంతులపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

మన దేశంలో 4 ఫార్మాసూటికల్ కంపెనీలు మాత్రమే పోలియో వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. అందులో ఘజియాబాద్ లోని బయోమెడ్ కంపెనీ తయారుచేసిన కొన్ని పోలియో నోటి చుక్కల బాటిళ్లలో టైప్-2 పోలియో వైరస్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంపిన ఈ బాటిళ్లలో మందు కలుషితం అయినట్టు గుర్తించారు. వెంటనే ఆ వ్యాక్సిన్లను వెనక్కి రప్పించింది. వెంటనే స్పందించిన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీకి నోటీసులు ఇచ్చింది. యజమానిని అరెస్టు చేయించింది.

కలుషితమైన పోలియో చుక్కలు పిల్లలకు వేయించామని టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ అంటోంది. ఒక వేళ కలుషితమైన వ్యాక్సిన్ వేసినా… ప్రాణాపాయం ఉండదని… భారతీయ పిల్లల్లో దానిని ఎదుర్కొనేంతు రోగ నిరోధక శక్తి ఉంటుందని తెలిపింది.

 

 

Posted in Uncategorized

Latest Updates