పోలీస్ జోలపాట…అధికారుల ప్రశంస

పోలీసులనగానే కఠినంగా ఉంటారు… దురుసుగా ప్రవర్తిస్తారని మాత్రమే ప్రజలకు తెలుసు. కానీ వారు అందరిలాంటి వారేనని, విధి నిర్వహణలో భాగంగా అలా ప్రవర్తిస్తుంటారనే విషయం మర్చిపోతున్నాం. ఖాకీల కరుణ హృదయానికి అద్దం పట్టే ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వరైల్ అవుతుంది. నిన్న(ఆదివారం) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్ష జరిగింది. ఈ క్రమంలో మహబూబ్‌ నగర్‌ లో ఓ మహిళ తన నాలుగు నెలల చిన్నారితో కలిసి పరీక్షా కేంద్రం వద్దకు చేరుకుంది. అయితే పరీక్ష హాల్‌లోకి అభ్యర్థిని తప్ప ఎవరిని అనుమతించరు. దాంతో పరీక్ష రాసి వచ్చేంతవరకూ తన చిన్నారిని చూసుకోవడం కోసం తన బంధువుల అమ్మాయిని వెంట తీసుకొచ్చుకుంది. పరీక్ష ప్రారంభం కావడంతో ఆ మహిళ తన చిన్నారిని వెంట వచ్చిన మనిషి దగ్గర వదిలి లోపలికి వెళ్లింది. కానీ తల్లి అలా వెళ్లిన క్షణం నుంచి ఆ పాప గుక్కపెట్టి ఏడవడం ప్రారంభించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పాప ఏడుపు ఆపడం లేదు.

ఈ సమయంలోనే పరీక్ష కేంద్ర వద్ద విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ ముజీబ్‌ ఉర్‌ రెహ్మన్‌ ఆ పాపను తన చేతుల్లోకి తీసుకుని రకరకాలుగా లాలిస్తూ ఆ పాప ఏడుపును ఆపించాడు. తాను పోలీస్‌ ఉద్యోగిననే గర్వం ఏమాత్రం లేకుండా చిన్నారిని ఆడిస్తున్న ముజీబ్‌ ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌’కు అసలైన ఉదాహరణగా నిలిచాడని ట్విట్ చేసింది ఓ ఐపీఎస్‌ ఆఫీసర్. చిన్నారిని ఆడిస్తున్న ముజీబ్‌ ఫోటోను రమా రాజేశ్వరి అనే ఐపీఎస్‌ అధికారి తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. దాంతో పాటు #Human Face Of Cops అనే హాష్‌ ట్యాగ్‌ను జత చేశారు ఆమె.

Posted in Uncategorized

Latest Updates