ప్రజల దగ్గరకే పాలన : సంబురంగా కొత్త పంచాయతీలు ఆవిర్భావం

పల్లె ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త పంచాయతీల పాలన ఆగస్టు 2వ తేదీ నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో 4వేల 378 కొత్త పంచాయతీలు ఆవిర్భవించాయి. ఈ సందర్భంగా గ్రామస్థుల సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా వేడుకల్లో పాలు పంచుకొన్నారు. కొత్త పంచాయతీల ప్రారంభంలో ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఇతర ప్రతినిధులు ఎవరి పరిధిలో గ్రామస్తులతో కలిసి కొత్త వాటిని ప్రారంభించారు. ముఖ్యమంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రత్యేక అధికారులకు స్వాగతం పలికారు.

డప్పుల మోతలతో… లంబాడీల నృత్యాలు…గోండుల రేలా నృత్యాలు 

.. వనపర్తి జిల్లాలో 151 పంచాయతీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. పంచాయతీ భవనాలకు రంగులు వేశారు. మామిడి తోరణాలు, అరిటి ఆకులు కట్టారు. ముగ్గులు వేశారు. డప్పుల చపుళ్లు..ప్రజల నృత్యాలతో కొత్త పంచాయతీ పాలనకు స్వాగతం పలికారు. జిల్లాలో 71 గిరిజన తండాలు పంచాయతీలుగా అవతరించాయి. తండాల్లో పంచాయతీల ప్రారంభ వేడుకల్లో లంబాడీల నృత్యాలు ఆకట్టుకొన్నాయి. పాటలు పాడుతూ..నృత్యాలు చేస్తూ సంబరంగా గడిపారు.

… ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని డోంగరగాం అనే గిరిజన గూడెం పంచాయతీగా అవతరించడంతో గోండు గిరిజనులు రేలా నృత్యం చేశారు. తుమ్మగూడ గిరిజనులు  సంప్రదాయ డోలు వాయిద్యంపై దరువేస్తూ ఊరేగింపు తీశారు.

… నల్లగొండ జిల్లాలో ఉమ్మడి చందంపేట మండలంలో 28 లంబాడీ తండాలు పంచాయతీలుగా ఆవిర్భవించాయి.

… వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం రసూల్ పల్లి గ్రామస్తులు తమ ఎమ్మెల్యే డప్పు చపుళ్లు.. నృత్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు.

Posted in Uncategorized

Latest Updates