ప్రతి రైతు భీమా తీసుకునేలా చూడాలి : పోచారం

pochramnzbకామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్, జిల్లా రైతు సమన్వయ సమితి (రైసస) సభ్యులకు అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సులో మంత్రి పొచారం మాట్లాడుతూ.. విత్తనం వేసిన దగ్గర నుండి పండిన పంట గిట్టుబాటు ధరకు అమ్ముకునే వరకు రైతు సమన్వయ సమితి సభ్యుల బాధ్యతన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆసలు సిసలైన వ్యవసాయం చేస్తున్నది. సేద్యంలో సాదకబాధలు తెలిసిన రైతులనే రైతు సమన్వయ సమితీ సభ్యులుగా నియమించింది. గతంలో కాంగ్రెస్ హయాంలో అనర్హులను ఆదర్శ రైతులగా నియమించి వ్యవస్థను అభాసుపాలు చేశారని విమర్శించారు. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నాణ్యమైన ఉచిత విద్యుత్ 24 గంటలు అందిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో 80 లక్షల ఎకరాల వర్షాధార భూములున్నాయి. ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల క్రింద ఉన్న 20 లక్షల ఎకరాలకు కలిపి మొత్తం కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పోచారం తెలిపారు. అప్పులు లేకుండా పంటలను సాగుచేయడానికి రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ. 4000 ఈ వానాకాలం నుండే అందిస్తామన్నారు. ఎరువులకు, విత్తనాలకు కొరత లేదని, వ్యవసాయ యాంత్రీకరణకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. భవిష్యత్తులో అప్పు అవసరం లేకుండా స్వంత పెట్టుబడితో రైతులు వ్యవసాయం చేయాలన్నారు.

రైతు సమన్వయ సమితి సభ్యులు చేయవలసిన పనులపై మంత్రి పోచారం దిశా నిర్దేశం చేశారు. మండల రైసస కన్వీనర్ పర్యవేక్షణలో ప్రతి గ్రామ రైసస సభ్యులు తప్పనిసరిగా రైతులందరితో సమావేశం నిర్వహించాలన్నారు. రైతులు ఏయే పంటలను, ఎన్ని ఎకరాల్లో సాగుచేస్తారో తెలుసుకొని, వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా అధిక దిగుబడినిచ్చే వంగడాలను తెప్పించి రైతులకు అందించాలన్నారు. పంట ఉత్పత్తులకు ధరలు తగ్గినప్పుడు గ్రామ, మండల, జిల్లా రైసస లు జిల్లా, రాష్ట్ర కమిటీకి సమాచారం ఇచ్చి రైతుల నుండి కొనుగోలు చేసి నిల్వ చేస్తాయి. రాష్ట్ర రైసస కి 6 నుండి 7 వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుంది. రైతు బంధు పథకంలో గీవ్ ఇట్ కార్యక్రమంలో వదులుకున్న నగదు రాష్ట్ర రైసస కి చెందుతుంది. రాష్ట్రంలో రుణాలు తీసుకునే రైతులు 40 లక్షల మంది ఉంటే 10 లక్షల మంది మాత్రమే తమ పంటలకు భీమా చెల్లిస్తున్నట్లు పోచారం వెల్లడించారు.

Posted in Uncategorized

Latest Updates