ప్రపంచంలోనే అతి పెద్దది : నోయిడాలో భారీ మొబైల్ ఫ్యాక్టరీ

మొబైల్‌ ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే రెండో పెద్ద దేశం భారత్‌ అన్నారు ప్రధాని మోడీ. నాలుగేళ్ల క్రితం మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీలు మా దేశంలో రెండే ఉండగా ఇప్పుడు 120కి చేరాయన్నారు మోడీ. వీటిల్లో నోయిడాలోనే 50శాతం ఉన్నాయని చెప్పారు. డిల్లీ శివారులో ఉన్న నోయిడాలో ప్రపంచంలోనే పెద్దదైన మొబైల్‌ ఫోన్ల తయారీ కర్మాగారాన్ని సోమవారం(జూలై-9) ప్రారంభించారు మోడీ. దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ రూ.5వేల కోట్లతో ఏడాదికి 12 కోట్ల స్మార్ట్‌ ఫోన్ల తయారీ సామర్థ్యంతో ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ..మొబైల్‌ ఫోన్ల తయారీలో ప్రపంచ కూడలిగా భారత్‌ ను మలచడంలో ఈ రోజు ముఖ్యమైన రోజు అన్నారు. మొబైల్‌ ఫోన్ల తయారీ కర్మాగారాలు పెరగడంతో నాలుగు లక్షల ప్రత్యక్ష ఉద్యోగాల సృష్టి జరిగిందన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థ అని, నయా మధ్యతరగతి విస్తరణతో అపరిమిత అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు ప్రధాని. ‘‘భారత్‌లో తయారీపై మేము పెడుతున్న శ్రద్ధ కేవలం మా ఆర్థిక విధానంలో భాగం మాత్రమే కాదు. దక్షిణ కొరియా లాంటి దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల పట్ల మేము చూపిస్తున్న శ్రద్ధ కూడా.’’ అని అన్నారు. ఈ కర్మాగారంలో తయారయిన ఫోన్లలో 30శాతం ఫోన్లను ఎగుమతి చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. దాదాపు అన్ని మధ్యతరగతి ఇళ్లలోనూ కొరియా ఉత్పత్తులు కనిపిస్తాయన్నారు. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో శాంసంగ్‌ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిందన్నారు. భారత్‌లో 40 కోట్ల స్మార్ట్‌ ఫోన్లు వినియోగంలో ఉన్నాయని, 32 కోట్ల మంది బ్రాడ్‌బాండ్‌ను ఉపయోగిస్తున్నారని ప్రధాని చెప్పారు. లక్షకు పైగా గ్రామ పంచాయితీలకు ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌ చేరడం, చౌకలో ఇంటర్నెట్‌ డేటా అందుబాటులో ఉండడంతో దేశం డిజిటల్‌ విప్లవం వైపు అడుగులు వేస్తోందన్నారు మోడీ.

కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే మాట్లాడుతూ భారత్‌ వేగవంతమైన వృద్ధిలో కొరియా సంస్థలు భాగస్వాములవుతున్నాయని చెప్పారు. ఈ కర్మాగారంతో రెండు వేల కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates