ప్రపంచంలోనే పెద్ద స్కీమ్ : ఆయుష్మాన్ భారత్ ను ప్రారంభించిన మోడీ

నిరుపేదలకు ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన(PMJAY) వరమన్నారు ప్రధాని మోడీ. కేంద్రం పతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన హెల్త్ కేర్ స్కీమ్ ఆయుష్మాన్‌ భారత్‌ ను ఇవాళ(సెప్టెంబర్-23) జార్ఖండ్ రాజధాని రాంచీలో లాంచ్ చేశారు ప్రధాని మోడీ. ప్రపంచంలోనే ఈ విధమైన హెల్త్‌ కేర్‌ కార్యక్రమం మరెక్కడా లేదని మోడీ అన్నారు. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల మొత్తం జనాభా కన్నా…ఎక్కువ మంది ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా లబ్ది పొందనున్నారని మోడీ అన్నారు. ఆరు నెలల వ్యవధిలోనే తమ ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమాన్ని అమలు చేయగలిగిందన్నారు. దేశంలోని 50 కోట్ల మంది పేద ప్రజల ఆశీస్సులతో అధికారుల బృందం రెట్టించిన ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో దేశవ్యాప్తంగా 13,000 ఆస్పత్రులు భాగస్వామలుగా చేరాయన్నారు.

గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే దేశంలో స్కీమ్ లను ప్రవేశపెట్టాయని ఈ సందర్భంగా పరోక్షంగా కాంగ్రెస్ ని విమర్శించారు మోడీ. గరీబీ హఠావో అని నినదించిన నేతలు నిజానికి పేదల సంక్షేమానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదన్నారు. కుల, మతాలతో సంబంధం లేకుండా అందరికీ అభివృద్ధి అందాలనే ఉద్దేశంతోనే ఆయుష్మాన్‌ భారత్‌ ను ప్రారంభించినట్లు మోడీ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates