ప్రపంచం గుర్తించేలా రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ది : సీఎం కేసీఆర్

kcr2రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయిలో వెలుగులోకి తెచ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. కామారెడ్డి పట్టణానికి దగ్గరలో వున్న అడ్లూరి చెరువును 64 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తామని ప్రకటించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కామారెడ్డి పట్టణ సమీపంలో ఉన్న అడ్లూరి ఎల్లారెడ్డి చెరువుకట్టను అభివృద్ది, సుందరీకరణపై కామారెడ్డి ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటిదశలో తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ తదితర మౌలిక అంశాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చిందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో వ్యవసాయాన్ని స్థిరీకరించి, అనుబంధ వృత్తులను బలోపేతం చేయడంపైనే దృష్టి సారిస్తామన్నారు. విద్య, వైద్యం, పర్యాటక రంగాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఉమ్మడి పాలనలో విస్మరించబడిన పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయిలో వెలుగులోకి తెచ్చేందుకు ప్రణాళికలు తయారుచేస్తామన్నారు సీఎం.

కామారెడ్డిలోని అడ్లూరి ఎల్లారెడ్డి చెరువును అభివృద్ధి పరిచి, చెరువు కింద 2500 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జాలువారే రీ-జనరేటెడ్ వాటర్ తోనే చెరువు నిండుతుందనీ, ఇందుకు అయ్యే ఖర్చు దాదాపు 64 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. చెరువు కట్టను బలోపేతం చేసి… వాటర్ ఫౌంటేన్, ఫుడ్ కోర్టులు, ఓపెన్ ఎయిర్ థియేటర్, సుందరీకరణ పనులను కూడా చేపట్టాలని ఆదేశించారు. ఇదే విధంగా రాబోయే కాలంలో అన్ని రిజర్వాయర్లు, చెరువుల ట్యాంకు బండ్ లను బలోపేతం చేసి…ఆహ్లాదరకమైన వాతావరణాన్ని పంచే విధంగా నిర్మిస్తామన్నారు కేసీఆర్.

 

Posted in Uncategorized

Latest Updates