ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో బయటపడింది: రాహుల్

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. మూడు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ విజయం ప్రజల విజయమన్నారు రాహుల్. మిగతా రెండు రాష్ట్రాలైన తెలంగాణ, మిజోరాంలలో మేం గెలవలేకపోయామని… ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. తెలంగాణ, మిజోరాంలలో గెలిచిన పార్టీలకు అభినందనలు తెలిపారు. గెలిచిన మూడు రాష్ట్రాల్లో ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకుంటామని రాహుల్ హామీ ఇచ్చారు.

యువత, రైతాంగం సమస్యలను తీర్చడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని.. ప్రభుత్వంపై అసంతృప్తి ఈ ఎన్నికల్లో వ్యక్తమైందన్నారు రాహుల్. పెరుగుతున్నకాంగ్రెస్ బలం బీజేపీకి సవాల్‌ విసరబోతోందని  హెచ్చరించారు. తెలంగాణలో మంచి ఫలితాలనే ఆశించామని… కానీ రాలేదన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో జాతీయ అంశాలు కూడా ప్రభావం చూపాయన్నారు. జాతీయస్థాయిలో ప్రతిపక్షాలన్నీఏకం కావడాన్ని నిన్న ఢిల్లీలో చూశారని.. సమాజ్‌వాదీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ల ఆలోచన విధానాలు ఒకటేన్నారు రాహుల్.

EVMలలో సమస్య అనేది విశ్వవ్యాప్తంగా ఉందన్నారు. ఈవీఎంలకు అడుగు భాగంలో ఉండే చిప్‌ను మానిప్యులేట్‌ చేయొచ్చని తెలిపారు. EVMల విధానం రద్దు చేసి బ్యాలెట్‌ పద్ధతిని అమలు చేయాలన్నదే తమ డిమాండ్‌ అన్నారు. బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని ఆరోపించారు రాహుల్.

Posted in Uncategorized

Latest Updates