ప్రభుత్వమే మక్కలు కొనుగోలు చేస్తుంది: సీఎం కేసీఆర్

యాసంగిలో పండిన మక్కలకు కనీస మద్దతు ధర చెల్లించి, ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ ఫెడ్‌ ద్వారానే కొనుగోలు చేయాలన్నారు సీఎం కేసీఆర్. రైతులు తక్కువ ధరకు మక్కలు అమ్ముకోవద్దని రైతులకు సూచించారు. మక్కలకు మద్దతు ధర చెల్లించకుండా గ్రామాల్లో దళారులే తక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి, ఎండీ జగన్‌మోహన్‌ శనివారం(ఏప్రిల్-7) సీఎంకు తెలిపారు. మక్కల కొనుగోలుకు రుణం తీసుకోవడానికి ప్రభుత్వం పూచీకత్తుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

దీనికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్‌.. మార్క్‌ఫెడ్‌కు కావాల్సిన గ్యారంటీ ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, మార్క్‌ఫెడ్‌ను సమన్వయం చేసుకుని మక్కల కొనుగోలు చేయాలని మంత్రి హరీశ్‌ రావుకు సూచించారు. రైతులెవరూ తక్కువ ధరకు మక్కలను అమ్ముకోవాల్సిన అవసరం లేదని… క్వింటాలుకు రూ. 1425 చెల్లించి ప్రభుత్వమే మక్కలు కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్క్‌ఫెడ్‌ రంగంలోకి దిగి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుందన్నారు. రూపాయి కూడా నష్టపోకుండా రైతులు దళారులకు మక్కలు అమ్మకుండా మార్కెటింగ్ అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

Posted in Uncategorized

Latest Updates