ప్రమాణ స్వీకారానికి సోనియా : కుమార స్వామి

KUMARASWAMYకర్ణాటక మంత్రివర్గ కూర్పు మంగళవారం (మే-22) ఫైనలైజ్ కానుంది. రాహుల్, సోనియా గాంధీలతో సోమవారం (మే-21) కుమారస్వామి సమావేశయ్యారు. ఢిల్లీలోనే డీల్ అంతా తేలిపోతుందనుకున్నా… తిరిగి తిరిగి బెంగళూరుకే చేరింది. మంగళవారం కర్ణాటక కాంగ్రెస్ నేతలు, JDSలీడర్లు సమావేశమై… పంపకాలు ఫైనల్ చేసుకోనున్నారు.

కర్ణాటకలో JDS-కాంగ్రెస్ కూటమిలో కేటాయింపుల వ్యవహారం ఇంకా తేలలేదు. దీనికోసమే ఢిల్లీ వెళ్లిన కాబోయే ముఖ్యమంత్రి H.D.కుమారస్వామి… కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రాహుల్ ఇంట్లో జరిగిన మీటింగ్ లో UPA చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. మంత్రివర్గం, ఇతర అంశాలను ఫైనల్ చేసే బాధ్యతను కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ K.C.వేణుగోపాల్ కు అప్పగించారు రాహుల్ గాంధీ. రేపు అన్ని విషయాలు డిసైడ్ చేస్తామన్నారు కుమారస్వామి. ప్రమాణానికి సోనియా గాంధీ వస్తారని చెప్పారు. JDSతో పొత్తు విషయంలో కొందరు కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలను కుమారస్వామి ఖండించారు. అవన్నీ బోగస్ వార్తలేనని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు కాంగ్రెస్-JDSల మధ్య విబేధాల వచ్చాయన్న వార్తలను మాజీ హోంమంత్రి రామలింగారెడ్డి కొట్టిపారేశారు. తాము వంద శాతం సంతోషంగా ఉన్నామన్నారు.

ఢిల్లీ చేరుకున్న కుమారస్వామి నేరుగా BSP ఆఫీస్ కు వెళ్లారు. ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతిని కలిశారు. ఎన్నికల్లో మద్దతిచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. బుధవారం జరిగే తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఆహ్వానించారు. తర్వాత సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీతో ఫోన్ లో మాట్లాడారు. ఏచూరీని కూడా ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఉదయమంతా దేవాలయాల చుట్టూ తిరిగారు కుమారస్వామి. హసన్ జిల్లాలోని లక్ష్మినరసింహస్వామి ఆలయం, రంగనాథ స్వామి ఆలయం, శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంసభ్యులతో కలసి దర్శనం చేసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates