సొంత రాష్ట్రానికే కాంగ్రెస్ అన్యాయం చేస్తోంది : హరీష్

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ కు పుట్టగతులుండవనే భయంతోనే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు మంత్రి హరీష్. మంగళవారం (జూలై-31) మీడియాతో మాట్లాడారు మంత్రి. కాళేశ్వరం నీళ్లు రైతు పొలాల్లోకి పారితే.. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు శాశ్వతంగా దూరం అవుతారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారంటే అర్ధం ఉందని.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియడంలేదన్నారు.

అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎంతకైనా దిగజారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో ప్రాజెక్టుకు మూడు, నాలుగు శంకుస్థాపనలు చేశారని.. అయినా ఏ ఒక్కటీ పూర్తి చేయలేకపోయారన్నారు.  రైతుల ప్రయోజనాల కంటే కాంగ్రెస్ కు అధికారమే ముఖ్యం అన్నారు. కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ కారులో కోదండరాం వెళ్లి, ప్రాజెక్టులకు భూములు ఇవ్వకూడదని రైతులను రెచ్చగెట్టినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన కారు వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. లాయర్లకు డబ్బులిచ్చి కాళేశ్వరంపై కోర్టులో కేసులు వేశారని ఆరోపించారు. అందుకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలను మీడియాకు వెల్లడించారు మంత్రి హరీష్.

ప్రాజెక్టులు పూర్తి చేస్తే TRS ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే కాంగ్రెస్ కుట్ర చేస్తుందని చెప్పారు. ప్రాణహితను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలను కేంద్రమంత్రి ఉమా భారతి లెటర్ ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ నేతలకేమో తెలంగాణ రైతులు లాభపడటం ఇష్టం లేదని.. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుపై టీఆర్‌ఎస్ పార్టీ ఏనాడైనా కేసులు వేసిందా అని ప్రశ్నించారు. భూసేకరణను అడ్డుకున్నామా.. అసలు పర్యావరణ, అటవీశాఖ అనుమతులు లేవు. అయినప్పటికీ ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు ప్రాజెక్టును 37 సంవత్సరాలు కట్టారు.. 9 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని 2000లో చెబితే.. ఇప్పటికీ 6 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇస్తున్న సంగతి నిజం కాదా అని నిలదీశారు. ఏ ప్రాజెక్టునూ కాంగ్రెస్ పూర్తి చేయలేదన్నారు.

Posted in Uncategorized

Latest Updates