ప్రాణం మీదకు తెచ్చిన మద్యం : మత్తులో గేటు దూకబోయి వ్యక్తి మృతి

DEATHమద్యం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. మత్తులో ఉన్న అతడు గేటుదూకబోతుండగా ఇనుప చువ్వలు టీ షర్టుకు గుచ్చుకోవడంతో మెడకు ఉరి పడింది. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన దూల్ పేట ప్రాంతంలో బుధవారం (మే-16) తెల్లవారుజామున జరిగింది.  వివరాల్లోకెళితే.. మహారాష్ట్రకు చెందిన ఆనంద్‌ గోకుల్‌ శ్యామ్‌శర్మ (40) హైదరాబాద్ లోని దూల్ పేట్  లో భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.

పిల్లలకు వేసవి సెలవులు కావడంతో భార్య, పిల్లలు యూపీలోని అమ్మగారి ఇంటికి వెళ్లారు. గోల్డ్‌ స్మిత్‌ అయిన ఆనంద్‌ గోకుల్‌ శ్యామ్‌ శర్మ మంగళవారం (మే-15) అర్ధరాత్రి వరకు పూటుగా తాగి తెల్లవారు రెండు గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. కాలింగ్‌ బెల్‌ నొక్కితే ఆ సమయంలో ఎవ్వరూ స్పందించలేదు. ఇంట్లో అతని బావమరిది అభిషేక్‌ ఉంటున్నాడు. అతనికి ఫోన్‌ చేసినా ఆ సమయంలో ఫోన్‌ ఎత్తలేదు. ఈ క్రమంలో బైకును గేటు బయటపెట్టి.. గేటు ఎక్కి లోపలికి దూకేందుకు ప్రయత్నించాడు. పది అడుగుల ఎత్తున్న ఇనుప గేటు చువ్వలు అతని టీ షర్టుకు గుచ్చుకోవడంతో చనిపోయాడు. తెల్లవారు జాము సమయం. ఎవ్వరూ బయటకు రాని పరిస్థితి. పక్కింటిలో నివసించే గోపి అనే వ్యక్తి గేటుకు వేలాడుతున్న ఇతన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు చెప్పారు డాక్టర్లు. ఇంటి యజమాని సురేందర్‌సింగ్‌ ను పోలీసులు విచారించగా.. ఏడు పోర్షన్లు ఉన్న ఈ అపార్ట్ మెంట్ లో వాచ్‌ మెన్‌ ఉన్నాడని, అయితే కర్ణాటకలో ఎన్నికల కోసం అతను తన సొంత ఊరుకు వెళ్లినందున వాచ్‌ మెన్‌ అందుబాటులో లేడని తెల్పినట్లు పోలీసులు తెలిపారు. ఆరేళ్లుగా ఇదే ఇంట్లో ఉంటున్న బాధితుడు నిత్యం మద్యం సేవించి వస్తుంటాడని, గతంలోనూ ఎన్నో సార్లు గేటు ఎక్కి లోపలికి దిగిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు.  ఎంత చెప్పినా ఇలాగే చేసేవాడని పోలీసులకు చెప్పారు స్థానికులు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిర్వహించి సొంత ఊరుకు బుధవారం సాయంత్రం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. అయితే మరణించిన అతడు గేటుకు వేలాడుతున్న దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది.

Posted in Uncategorized

Latest Updates