ప్రాణాలు తీసిన పైసలు : అప్పు తీర్చమంటే చంపేశారు

పైసా.. పైసా.. ఏం చేస్తావంటే ప్రాణాలు తీస్తానంటుంది. ఇప్పుడు ఇదే జరిగింది. అప్పు ఇచ్చిన పాపానికి ప్రాణాలు కోల్పోయాడు ఓవ్యక్తి.  ఈ సంఘటన హైదరాబాద్ లోని అత్తాపూర్ జూలై-17న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. బహద్దుర్‌ పురాకు చెందిన ఖాలేద్‌ మాలిక్‌ (44) బహుద్దుర్‌ పురాలో సొంతంగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ను నిర్వహిస్తున్నాడు.

స్థానికుడైన మహ్మద్‌ దస్తగిరి ఖాన్‌ చోటుబా(34)తో స్నేహం కుదిరింది. ఖాలేద్‌ వద్ద చోటుబా రూ.5లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అంతేకాకుండా చోటుబా తన స్నేహితుడైన రాజేంద్రనగర్‌ జలాల్‌ బాబానగర్‌ లో ఉండే సయ్యద్‌ ఖాజా(36)కు కూడా మరో రూ.లక్ష అప్పుగా ఇప్పించాడు. ఇద్దరూ తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడంలేదు. దీంతో ఖాలేద్‌ వారిపై ఒత్తిడి తెచ్చాడు. కోపం పెంచుకున్న చోటుబా, సయ్యద్‌ ఖాజాలు ఎలాగైన ఖాలెద్‌ ను హత్యచేయాలని నిర్ణయించుకున్నారు.

జూలై 17న రాత్రి 12.30 గంటలకు అత్తాపూర్‌ లోని గోల్డెన్‌ ప్యాలెస్‌ వెనుక గల్లిలో చోటుబా, ఖాలెద్‌, ఖాజాలు మద్యం సేవించారు. అదే సమయంలో చోటుబా, ఖాజాలు ..ఖాలెద్‌ కంట్లో కారం చల్లి వెంట తెచ్చుకున్న కత్తితో అతనిపై దాడి చేసి హత్యచేశారు. అనంతరం ఇద్దరు బోరబండలోని స్నేహితుడైన మహ్మద్‌ అబ్దుల్‌ ఇమ్రాన్‌(27) ఇంటికి వెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి చోటుబా, ఖాజాతోపాటు ఆధారాలు నాశనం చేసేందుకు నిందితులకు సహకరించిన ఇమ్రాన్‌ ను కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్‌ కు తరలించారు.

 

Posted in Uncategorized

Latest Updates