ప్రియుడితో కలసి తండ్రిని చంపింది

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి తండ్రిని చంపేసింది ఓ యువతి. నూజివీడు సమీపంలోని తుక్కులూరుకి చెందిన లింగమనేని శేషుకుమారి భర్త చాలాకాలం క్రితం చనిపోయాడు. ఆమెకు ఒక కుమారుడున్నాడు. ఆమె తండ్రి కృష్ణప్రసాద్‌ తోపాటు ఉంటుంది. ఇటీవల వేముల వెంకటేశ్వరరావు అనే వ్యక్తితో శేషుకుమారి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకొన్న కృష్ణ ప్రసాద్‌ తన కుమార్తెను మందలించాడు.

దాంతో తండ్రిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొంది శేషుకుమారి. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పింది. ఈ నెల 1వ తేదీ రాత్రి నిద్రపోతున్న తండ్రి కాళ్లను శేషుకుమారి గట్టిగా పట్టుకోగా, వెంకటేశ్వరరావు అతని ముఖంపై దిండుంచి గట్టిగా వత్తేశాడు. అప్పటికీ చనిపోకపోవడంతో రాడ్‌తో తలపై కొట్టి ప్రాణాలు తీశారు. అప్పటికే సిద్ధం చేసుకొన్న కారు డిక్కీలో ఆ మృతదేహాన్ని పడేసి ఇద్దరూ బయలుదేరారు. నిమ్మగడ్డ సమీపంలో రోడ్డు పక్కన మృతదేహాన్ని పడేసి, వెనుదిరిగారు. గుర్తుతెలియని మృతదేహం రోడ్డు పక్కన పడి ఉన్నట్లు పత్రికల్లో వచ్చిన వార్త, ఫొటో ఆధారంగా కృష్ణప్రసాద్‌ బంధువులు గుర్తించి, ఆ సమాచారం శేషుకుమారికి అందించారు. ఏమీ తెలియనట్టు ఆమె, ఆ మృతదేహాన్ని ఆస్పత్రిలో చూసి, అది తన తండ్రిదేనని అంగీకరించింది.

మృతుడి సెల్‌కు వచ్చిన కాల్స్‌ వివరాలు, కుమార్తె శేషుకుమారి సెల్‌ఫోన్‌ నుంచి వెళ్లిన కాల్స్‌ వివరాలతో పాటు సెల్‌టవర్‌ లోకేషన్‌లను పోలీసులు పరిశీలించారు. తండ్రి ఫోన్‌ తక్కులూరులోనే ఉందన్న సమయంలో ఆ సెల్‌ఫోన్‌ లోకేషన్‌ నిమ్మగడ్డ సమీపంలోని శ్రీకాకుళం టవర్‌ లోకేషన్‌ చూపినట్లు నిర్ధారణ కావడంతో కుమార్తె శేషుకుమారి సెల్‌ఫోన్‌ లోకేషన్‌ కూడా ఆ సమయంలో ఒకే ప్రాంతంలో చూపించడంతో విచారించగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణప్రసాద్‌ హత్యకేసులో నిందితులైన కుమార్తె శేషుకుమారిని, ఆమె ప్రియుడు వేముల వెంకటేశ్వరరావును బుధవారం అరెస్టు చేశారు. మృతదేహాన్ని తరలించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ సమావేశంలో అవనిగడ్డ డీఎస్పీ వి.పోతురాజు, సీఐ బి.జనార్ధన్‌లు వివరాలు తెలిపారు. దర్యాప్తులో కేసు వేగవంతానికి తోడ్పాటునందించిన కానిస్టేబుల్‌ కె.ఎన్‌.శివాజీని డీఎస్పీ, పోలీస్‌ అధికారులు అభినందించారు.

 

 

Posted in Uncategorized

Latest Updates