ప్రేమంటే ఇదే : యాసిడ్ బాధితురాలికి స్నేహితుడిగా సేవలు, బాధ్యతగా పెళ్లి

acid-attack-victim_759_ptiప్రేమికులకు ఎంతో ఇష్టమైన రోజు వాలంటైన్స్ డే. ఈ రోజు కోసం చాలా మంది ప్రేమికులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజును ఎలా జరుపుకోవాలి అంటూ కలలు కంటుంటారు. అయితే కలలో కూడా ఊహించని ఓ అమ్మాయికి వాలంటైన్స్ డే తన జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఒడిషా రాష్ట్రం జగత్ పూర్ కి చెందిన ప్రమోదిని(26).. ఓ ప్రేమోన్మాది చేతిలో 2009లో యాసిడ్ దాడికి గురైంది. 80శాతం శరీరం కాలిపోయింది. శారీరకంగా, మానసికంగా కోమాలోకి వెళ్లింది. ఎగ్జామ్ రాసి కాలేజ్ నుంచి వస్తున్న సమయంలో ప్రమోదినిపై ఈ దాడి జరిగింది. చూపు కూడా కోల్పోయింది. ట్రీట్ మెంట్ కోసం ప్రమోదినిని ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించారు తల్లిదండ్రులు. ట్రీట్ మెంట్ కు అవసరమయ్యే డబ్బులు లేక 9 నెలల తర్వాత ఇంటికి తీసుకెళ్లారు.

ఐదు సంవత్సరాలు ఇంట్లో మంచంపైనే ఉండిపోయింది ప్రమోదిని. 2014లో తల్లిదండ్రులు.. ఇంటి దగ్గర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడ ప్రమోదినికి.. సరోజ్ సాహు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. సాహు ఓ మెడికల్ రిప్రజంటేటివ్. ఓ నర్స్ ద్వారా ప్రమోదిని విషయం తెలుసుకుని కలవడానికి వెళ్లాడు. ప్రమోదిని చెప్పిన విషయాలు విని చెలించిపోయాడు. కోలుకునేంత వరకూ ఆమె పక్కనే ఉండి సాయం చేయాలనుకున్నాడు. డాక్టర్లు 10 నెలలు ట్రీట్ మెంట్ చేయాలని చెప్పడంతో.. తన ఉద్యోగాన్ని సైతం వదిలేసి సేవలు అందించాడు. కొన్ని రోజుల తర్వాత జగత్ పూర్ నుంచి మెరుగైన చికిత్స కొసం జనవరి 5, 2016న ప్రమోదిని ఢిల్లీ వెళ్లింది.

అప్పటి వరకూ తన ప్రాణ స్నేహితురాలిగా భావించిన సాహు.. ప్రమోదిని లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. జీవితంలో ఏదో కోల్పోయాననే ఫీలింగ్ వెంటాడింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఢిల్లీలోని ప్రమోదినికి ఫోన్ చేశాడు సాహూ. ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఆమె షాక్ అయ్యింది. యాసిడ్ దాడి తర్వాత శరీరం అంతా అంద విహీనంగా మారింది.. చూస్తేనే భయమేసే ముఖం.. అలాంటి నన్ను ప్రేమిస్తున్నావా అని సాహూని నేరుగానే ప్రశ్నించింది ప్రమోదిని. ఒప్పుకుంటే పెళ్లి చేసుకొంటానని చెప్పాడు సాహూ.

జీవితంలో ఇలాంటి మాట వింటానని కూడా ఊహించని ప్రమోదిని.. పెళ్లికి ఓకే చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న.. అలోక్ దీక్షిత్ అనే కెఫే కన్వీనర్  (Stop Acid Attack Campain) వారికి బాసటగా నిలిచాడు. 2018 ఫిబ్రవరి 14వ తేదీ బుధవారం వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. అంతేకాకుండా కెఫే సంస్థలో ప్రమోదినికి ఉద్యోగం కల్పించారు. ప్రపంచంలోనే వాలెంటైన్ డే రోజున జరిగిన అందమైన, అద్భుతమైన ప్రేమ ఇదే అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. ఆల్ ద బెస్ట్ ప్రమోది సాహూ..

Posted in Uncategorized

Latest Updates