ప్రేమించాడని యువకుడి హత్య!… కరీంనగర్ లో దారుణం

శంకరపట్నం : కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. శంకపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన 22ఏళ్ల గడ్డి కుమార్ ను గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. వంకాయగూడెం గ్రామ శివారులో రోడ్డుపక్కనే చెట్లలో అతడి మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రేమ వ్యవహారంలోనే అతడిని చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

తాడికల్ గ్రామానికి చెందిన కుమార్… అదే గ్రామానికి చెందిన మరో యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అబ్బాయిని, అతడి కుటుంబాన్ని అమ్మాయి తల్లిదండ్రులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. అమ్మాయి హుజురాబాద్ లో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఏడాది కిందట కుమార్ పై ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు కూడా పెట్టారు.

ఐతే… పోయిన ఆదివారం కుమార్ నుంచి చివరి కాల్ వచ్చిందని యువతి రోదిస్తూ మీడియాకు చెప్పింది. ఆదివారం రోజున ఓ నలుగురు వచ్చారని… తర్వాత వెళ్లిపోయారని… వాళ్లు తనను బెదిరించారని.. అవసరమైతే తానే వాళ్లను కొట్టడానికి సిద్ధమని కుమార్ చెప్పాడని వివరించింది. ఆ తర్వాత నుంచి కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉండిపోయిందని తెలిపింది. కుమార్ పేరెంట్స్.. పోలీస్ స్టేషన్ లో సోమవారం మిస్సింగ్ కేసు పెట్టారు. ఇంతలోనే… వంకాయగూడెం శివారులో అతడి మృతదేహం.. కనిపించింది. అతడిని చంపి కాల్చేసినట్టు అనుమానిస్తున్నారు.

మృతదేహం దగ్గరే కుమార్ కుటుంబసభ్యులు, బంధువులు రోదిస్తున్నారు. ప్రేమించిన పాపానికే చంపేశారంటూ.. నిందితులకు వదిలిపెట్టొద్దంటూ… రోడ్డును బ్లాక్ చేసి ఆందోళన చేస్తున్నారు. దీంతో కరీంనగర్-హుజురాబాద్ రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడికొచ్చిన పోలీసులపై బాధితులు, గ్రామస్తులు ఎదురుతిరిగారు. పోలీస్ వాహనం అద్దాలను రాళ్లతో కొట్టి ధ్వంసం చేశారు. ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలంలో పరిస్థితి ఉద్రిక్తంగా కనిపిస్తోంది.

 

Posted in Uncategorized

Latest Updates