ప్రైవేట్ బస్సుల కొత్త రూట్ : ఔటర్ నుంచే బెజవాడ, బెంగళూరు

తెలంగాణ ఆర్టీఏ అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రాత్రి 7 దాటితే చాలు సిటీలో రెగ్యులర్ ట్రాఫిక్ తోపాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల హడావిడి అంతా ఇంతా కాదు. వీక్ డేస్ లోనే 250 నుంచి 300 బస్సులు.. వీకెండ్ లో 500 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సిటీ నుంచి వెళుతున్నాయి. దీంతో హైదరాబాద్ సిటీ రాత్రి 7 నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. విజయవాడ, బెంగళూరు, ముంబైతోపాటు ఇతర నగరాలకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో రోడ్లు కిటకిటలాడుతున్నాయి. దీనికితోడు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఆపటంతో ట్రాఫిక్ చిక్కులు ఏర్పడుతున్నాయి. దీనికి పరిష్కారం చూపించబోతున్నారు ఆర్టీఏ అధికారులు. ఇక నుంచి విజయవాడ, బెంగళూరు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ కూడా ఔటర్ మీదుగా మళ్లించాలనే నిర్ణయానికి వచ్చారు.

అశోక్ నగర్, బీహెచ్ఈఎల్, మియాపూర్, KPHB, కూకట్ పల్లి నుంచే కనీసం 200 బస్సులు విజయవాడ, బెంగళూరు, గుంటూరు ప్రాంతాలకు బయలుదేరుతున్నాయి. వీటిని సిటీలో నుంచి కాకుండా గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మళ్లించాలని భావిస్తున్నారు. దీంతో రాత్రి సమయాల్లో హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలనేది వ్యూహం.  SR నగర్, అమీర్ పేట ప్రయాణికులు కూడా కూకట్ పల్లి వరకు వచ్చి బస్సు ఎక్కే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు. కూకట్ పల్లి, మియాపూర్ నుంచి గచ్చిబౌలి మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి.. విజయవాడ హైవే ఎక్కొచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతవాసులు కార్లలో వెళ్లే సమయంలో ఈ రూట్ లోనే వెళుతున్నారు.

ప్రస్తుతం బీహెచ్ఈఎల్ లో రాత్రి 8.30గంటలకు బస్సు ఎక్కిన ప్రయాణికులు.. ఎల్బీ నగర్ సిటీ దాటడానికి కనీసం 11.30 గంటలు అవుతుంది. అంటే 3 గంటల సమయం సిటీలోనే ఉంటున్నారు. దీనికితోడు ట్రాఫిక్ రద్దీ, పొల్యూషన్ కూడా పెరిగిపోతుంది. సమయంతోపాటు ట్రాఫిక్ రద్దీని కంట్రోల్ చేయటానికి ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు అధికారులు. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, విధివిధానాలు విడుదల కానున్నాయి.

Posted in Uncategorized

Latest Updates