ప్లాస్టిక్ భూతం : కరీంనగర్ జిల్లాలో నెల వ్యవధిలో మూడు ఆవులు మృతి

వాడే టూత్ బ్రష్ నుంచి అంతా.. ప్లాస్టిక్ .. ప్లాస్టిక్. పాల ప్యాకెట్  నుంచి పండ్లు, మాంసం, హోటళ్లు,  కర్రీపాయింట్ల పార్సిళ్లకూ ప్లాస్టిక్  కవర్లే వాడుతుంటాం. ప్లాస్టిక్ భూతం మనుషులకే కాదు.. పశువుల పాలిట శాపంగా మారుతోంది. కరీంనగర్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలోనే దాదాపు మూడు ఆవులు ప్లాస్టిక్ కవర్లు తిని ప్రాణాలు వదిలాయి. మరెన్నో మరణం అంచున అవస్థలు పడుతున్నాయి.

మానవుడు తమ అవసరాల కోసం వాడి పడేసిన ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు ఇతర ప్లాస్టిక్ వస్తువులు మూగజీవులకు శాపంగా మారాయి. డ్రైనేజీల పక్కన, రోడ్లపై ప్లాస్టిక్ కవర్లు తింటూ గోవులు ఆకలి తీర్చుకుంటున్నాయి. తిన్న ప్లాస్టిక్ కవర్లు జీర్ణం కాక పేగులో ఓ మూటలాగా మారి గోమాతలు చనిపోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడొద్దని ఇటీవల మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ.. ఎక్కడా అవి అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. 50 మైక్రాన్ లకంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్  కవర్లను వినియోగించొద్దన్న సూచనలు ఎక్కడా పట్టించుకోవడం లేదు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, రామగుండం, జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, సిరిసిల్ల, వేములవాడ, హుజురాబాద్, హుస్నాబాద్, పెద్దపల్లి, జమ్మికుంట పట్టణాలున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేధాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంటుంది. కానీ నియంత్రణ లేక విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు. ఖాళీ స్థలాల్లో, పబ్లిక్ ప్లేసుల్లో, డ్రైనేజీల్లో కనిపించే చెత్తలో సగానికి పైగా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సీసాలే ఉంటున్నాయి. పట్టణాల్లో రోడ్లపై తిరిగే పశువులకు సరైన ఆహారం దొరక్క… ప్లాస్టిక్ కవర్లు తింటూ ప్రాణాలొదులుతున్నాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజు దాదాపు 500 మెట్రిక్  టన్నుల తడి, పొడి చెత్త ఉత్పత్తి అవుతోంది. అందులో కనీసం 10 శాతం అంటే 50 మెట్రిక్  టన్నుల మేర ప్లాస్టిక్  ఉంటోంది. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్న మున్సిపల్ సిబ్బంది వాటిని నేరుగా డంపు యార్డులకు తీసుకెళ్తున్నారు. కానీ చాలా మంది మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు చెత్త వేయకుండా.. ఆ తర్వాత వాటిని ఖాళీ స్థలాలు, డ్రైనేజీల్లో పారేస్తున్నారు. ఇటీవల రోడ్లపక్కన ఉన్న ప్లాస్టిక్  కవర్లను తిన్న మూడు ఆవులు తీవ్ర అస్వస్తతకు గురై చనిపోయాయి. చనిపోయిన పశువులను పోస్టు మార్టం చేసినప్పుడు వందల కొద్దీ ప్లాస్టిక్ కవర్లు వాటి పొట్ట నుంచి బయటపడ్డాయి.

Posted in Uncategorized

Latest Updates