ఫస్ట్ గేర్ పడింది : నో హెల్మెట్ – నో పెట్రోల్

హెల్మెట్ మస్ట్ అంటూ ఎంత ప్రచారం చేసినా.. ఎన్ని ఫైన్స్ వేసినా మార్పు రావటం లేదు.. లక్షల సంఖ్యలో ఇప్పటికే వాహనదారులు హెల్మెట్ లేని చలానాలు అందుకున్నారు.. అయినా నా జీవితం.. నా ఇష్టం.. నా చావు.. నా ఇష్టం అంటూ డోంట్ కేర్ అని తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులు మరో కొత్త ఐడియాతో ముందుకొచ్చారు. హెల్మెట్ లేకపోతే బండి నడవని విధంగా ఆలోచన చేశారు. అందులోభాగంగా.. పెట్రోల్ బంకులోకి వచ్చే వాహనదారుడికి హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయకుండా ఆయా బంకు యజమానులతో మాట్లాడుతున్నారు. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రణాళిక రచిస్తున్నారు.

ముందస్తుగా.. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నడుస్తున్న పెట్రోల్ బంకుల్లో నో హెల్మెట్ – నో పెట్రోల్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం జైళ్ల శాఖ ఆధ్వర్యంలో 13 పెట్రోల్ బంకులు నడుస్తున్నాయి. ఆయా బంకుల్లో ఇక నుంచి హెల్మెట్ లేకపోతే టూ వీలర్ కు పెట్రోల్ కొట్టరు. మరికొన్ని రోజుల్లో ఓపెన్ కాబోతున్న మరో 8 పెట్రోల్ బంకుల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ప్రకటించారు. ఇదే విధానాన్ని మిగతా పెట్రోల్ బంకు యాజమాన్యాలు కూడా స్వచ్చంధంగా అమలు చేస్తే బాగుంటుందని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.

Posted in Uncategorized

Latest Updates