ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన SBI

ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). జూలై 30వ తేదీ సోమవారం నుంచే పెరిగిన వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంవత్సరంలోపు డిపాజిట్లపై మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఏడాది నుంచి పదేళ్ల కాల పరమితిలో డిపాజిట్ చేసిన సొమ్ముకి వడ్డీ రేట్లు పెంచారు. ఏడాది నుంచి రెండేళ్ల వరకు కాల పరిమితిపై 6.65 నుంచి 6.7శాతం వడ్డీ పెంచారు. రెండు నుంచి మూడేళ్ల కాలపరిమితిపై 6.65 నుంచి 6.75శాతం వరకు వడ్డీ పెరిగింది. మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితిపై 6.7 నుంచి 6.8శాతం వరకు వడ్డీ పెరిగింది. ఐదేళ్ల నుంచి పదేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీని 6.75 నుంచి 6.85శాతానికి పెంచారు.

ఇక సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు పెంచింది SBI. ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితికి 7.15 నుంచి 7.2శాతానికి వడ్డీ పెరిగింది. రెండేళ్ల నుంచి మూడేళ్ల కాలపరిమితికి 7.15 నుంచి 7.25శాతానికి వడ్డీ రేటు పెరిగింది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలపరిమితిపై 7.2 నుంచి 7.3శాతానికి వడ్డీ పెంచారు. ఇక ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు డిపాజిట్లపై 7.25 నుంచి 7.35శాతానికి వడ్డీ పెరిగింది. ఇవన్నీ కూడా కోటి రూపాయలు, అంత కంటే తక్కువ డిపాజిట్లపైనే పెరిగిన వడ్డీ రేట్లు అమలు అవుతాయి. SBI బాటలోనే మిగతా బ్యాంకులు కూడా ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates