ఫిఫా వరల్డ్ కప్ : సెమీస్ చేరిన క్రొయేషియా

fifaరష్యాకు ఊహించని షాక్ ఎదురైంది. క్రొయేషియాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌ లో 3-4 గోల్స్‌ తో ఓటమిపాలైన రష్యా..టోర్నీ నుంచి నిష్క్రమించింది. నిర్ణీత సమయంలో 1-1 గోల్స్‌ తో రెండు జట్లూ సమవుజ్జీలుగా నిలువగా.. అదనపు సమయంలోనూ చెరోగోల్ కొట్టి 2-2తో స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌ కు దారితీసింది. విజయం కోసం కొదమసింహాల్లా తలపడ్డాయి.. 1998 అరంగేట్రంలోనే ఫిఫా ప్రపంచకప్ సెమీస్ చేరిన క్రొయేషియా.. అద్భుత పోరాటంతో రష్యాను నిలువరించేందుకు ప్రయత్నించింది. పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా సొంత ప్రేక్షకుల మద్దతుతో రష్యా జట్టు ..క్రొయేషియాను వణికించింది. ఆడినంతసేపూ బాగా ఆడింది. ఈ క్వార్టర్‌ ఫైనల్లో క్రొయేషియా కంటే ముందే గోల్‌ చేసింది. అదనపు సమయం దాకా దీటుగా బదులిచ్చింది. అయితే.. షూటౌటే ఆతిథ్య జట్టు కొంపముంచింది. ఇద్దరు ఆటగాళ్లు షూటౌట్‌ ఒత్తిడిలో చిత్తవడంతో చివరకు క్రొయేషియా 4–3తో విజయం సాధించింది.

రష్యా తరఫున డెనిస్‌ చెరిషెవ్‌ (31వ ని.), మరియో ఫెర్నాండెస్‌ (115వ ని.) చెరో గోల్‌ చేయగా… క్రొయేషియా తరఫున అండ్రెజ్‌ క్రామరిక్‌ (39వ ని.), డొమగొజ్‌ విదా (100వ ని.) గోల్‌ చేశారు. అయితే షూటౌట్‌లో రష్యా జట్టులో స్మొలొవ్‌తో పాటు ఫెర్నాండెస్‌ విఫలం కాగా జగొయెవ్, ఇగ్నాషెవిచ్, కుజియయెవ్‌ గోల్‌ సాధించారు. క్రొయేషియాలో మటే కొవసిక్‌ మినహా బ్రొజొవిక్, మోడ్రిక్, విదా, రకిటిక్‌ గోల్‌ చేయడంతో ఆ జట్టు సెమీస్‌ చేరింది. బుధవారం జరిగే సెమీఫైనల్లో మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌ తో క్రొయేషియా తలపడుతుంది. ప్రపంచకప్‌ లో క్రొయేషియా సెమీస్‌ చేరడం ఇది రెండోసారి. 1998లో తొలిసారి ప్రపంచకప్‌ లో ఆడిన ఆ జట్టు మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates