ఫిబ్రవరి 24 నుంచి పెద్దగట్టు జాతర

సూర్యాపేట, వెలుగు: తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరు పొందిన దురాజ్‌ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరను ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు సూర్యాపేట కలెక్టర్ కె.సురేంద్రమోహన్ తెలిపారు. జాతర ఏర్పాట్లపై గురువారం ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లుతో పాటు, అధికారులతో సమీక్షించారు.

గతంలో కంటే 25 శాతం మంది భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జాతరకు వారం రోజుల ముందు నిర్వహించే దిష్టిపూజ సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని ఆదేశించారు. గత జాతరలో కోనేరు వద్ద నిర్మించిన స్నానాల గదులు, మరుగు దొడ్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. టెంపరరీ టాయిలెట్లతో పాటు మొబైల్ మూత్రశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. షాపులను లాటరీ పద్ధతిలో కేటాయించాలని.. కలెక్టరేట్‌ లో అనుమతులు పొందాలని సూచించారు. షాపులను కేటాయించినవారు మాత్రమే నడపాలని, ఇతరులకు అప్పగించినా, కొబ్బరికాయలను నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు అమ్మినా చర్యలు తీసుకుంటామన్నారు.

సీసీ, డ్రోన్‌ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షించాలని ఎస్పీకి సూచించారు కలెక్టర్ సురేంద్రమోహన్. ఎనిమిది ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు, అంబులెన్స్‌‌లను అందుబాటులో ఉంచాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. గట్టుప్రాంతాన్ని ఆరు జోన్లుగా విభజించి పారిశుద్ధ్య పనులు చేట్టాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. తాత్కాలిక నివాసాల కోసం 30 ఎకరాలను కేటాయించి చదును చేయాలని, ఆయా ప్రాంతాల్లో నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని కోరారు. పంట పొలాలను చదును చేస్తే నష్ట పరిహారం అందిస్తారన్నారు. జాతరకు వచ్చే ముఖ్య అతిథులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక కమిటీని నియమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates