ఫేక్ ఐడీలతో హోటల్ బుకింగ్ : ఆర్డర్ చేసిన గోల్డ్ తో జంప్

స్టార్ హోటల్స్ లో బస చేయడం..డబ్బులు కట్టకుండా చెక్కేయడం. అంతటితీ ఆగకుండా హోటల్ పేరు చెప్పి విలువైన వస్తువులు బుక్ చేసుకోవడం. వాటితో ఉడాయించడం. ఓ దొంగ తెలివితేటలు ఇవి. పలు రాష్ట్రాల్లో వరుసగా మోసాలు చేస్తున్న ఈ హైటెక్ దొంగను మంగళవారం (జూలై-17) పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. నిందితుడి నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో డీసీపీ సుమతి వివరాలు వెల్లడించారు. అండమాన్‌ నికోబార్‌ పోర్ట్‌బ్లెయిర్‌ కు చెందిన సర్తాక్‌రావు బాబ్రాస్‌(38) పదో తరగతి వరకు చదివాడు. తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలని చోరీలకు పాల్పడుతున్నాడు.  స్టార్‌ హోటల్‌ లో బస చేసి వాట్సప్‌ లో నగలు ఆర్డర్‌ చేసి తెప్పించుకొని తిరుగుతాడని.. లఖ్‌ నవ్‌, న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, అండమాన్‌ నికోబార్‌ లో నాలుగుసార్లు స్టార్‌ హోటళ్లలో నకిలీ ఐడీ కార్డులు చూపించి బస చేశాడు.

రెండు రోజులు ఉండి బిల్లు చెల్లించకుండా పారిపోయాడు. ఇదే తరహాలో జూలై 5న సికింద్రాబాద్‌ లో ఓ హోటల్‌ లో ఐడీ కార్డు చూపించి రెండు రోజులు బస చేశాడు. పలు పత్రికల్లో ప్రచురితమైన ఆభరణాల మోడళ్లను చూశాడు. సికింద్రాబాద్‌ పార్క్‌ లేన్‌ లోని అమర్‌ సాన్‌ జువెలరీ దుకాణం యజమాని సురే దోచానికియాకు ఫోన్‌ చేశాడు. పత్రికల్లో మీరిచ్చిన ప్రకటన చూశానని.. తనకు లక్ష రూపాయల విలువగల నగలు కావాలని, డిజైన్లను వాట్సప్‌ లో పంపించమని చెప్పగా దుకాణం యజమాని అతడు చెప్పినట్టు చేశాడు. మీరు పంపిన డిజైన్లలు రెండు నచ్చాయని… తాను బసేరా హోటల్‌ లో రూమ్‌ నెంబర్‌ 307లో ఉన్నానని అవి పంపించమని చెప్పాడు. నగల దుకాణం యజమాని సేల్స్‌ మన్‌ కు ఇచ్చి 18.94, 14.09 తులాల బంగారు గొలుసులు రెండింటిని పంపించాడు. సేల్స్‌ మన్‌ ను రూమ్‌ లో కూర్చొబెట్టి జ్యూస్‌, భోజనం ఆర్డర్‌ చేశాడు. నగలను జేబులో పెట్టుకొని ATMకు వెళ్లి డబ్బు డ్రా చేసుకొస్తానని బయటకు వచ్చి ఉడాయించాడు. ఎంతసేపైనా బాబ్రాస్‌ రాకపోవడంతో సేల్స్‌ మన్‌ యజమానికి ఫోన్‌ చేసి అసలు విషయం చెప్పాడు.

తాము మోసపోయామని భావించిన బాధితుడు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. CC ఫుటేజీల ఆధారంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మంగళవారం చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారు. అతడిని విచారించగా బసేరా హోటల్‌కు నగలు తెప్పించుకొని వాటిని తీసుకొని పారిపోయినట్టు అంగీకరించాడు. నిందితుడి నుంచి నగలు, రూ. 25 వేలు, సెల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, అండమాన్‌ నికోబార్‌ ప్రాంతాల్లో పలు పోలీ్‌సస్టేషన్లలో అతడిపై కేసులుండడంతో DCP అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అండమాన్‌ నికోబార్‌ లో ఓ కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఐడీ కార్డులు ఉంటేనే రూమ్‌లు అద్దెకు ఇవ్వాలని ఈ సందర్భంగా లాడ్జీల యజమానులకు  సూచించారు DCP.

 

Posted in Uncategorized

Latest Updates