ఫైనల్ ఎపిసోడ్ లో పులి-కమలం బంధం

పులి.. కమలం బంధం చివరి అంకానికి చేరుకుంది. తెగదెంపుల అధికార ప్రకటనే లేట్.. అన్న స్థాయికి చేరింది. ఇన్ని రోజులు కాస్త అటు…ఇటుగా ఉన్న శివసేన….ఇప్పుడు డైరెక్ట్ ఎటాక్ మొదలు పెట్టింది. పాయింట్ టూ పాయింట్ BJPని కడిగి పారేస్తోంది. నాలుగేళ్లలో BJPతో పైసా పని కూడా కాలేదని సామ్నా వేదికగా సమరం మొదలెట్టింది.

2014లో బీజేపీతో పొత్తుపెట్టుకున్న శివసేన..  ఇప్పుడు క్రమంగా ఆ పార్టీకి దూరమవుతోంది. మొన్న లోక్ సభలో జరిగిన అవిశ్వాస చర్చకు కూడా ఆ పార్టీ దూరంగా ఉంది. అవిశ్వాసం మరుసటి రోజునుంచి శివసేన అధికార పత్రిక సామ్నాలో వరుసపెట్టి ఎడిటోరియల్స్, ఇంటర్వ్యూలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ లోక్ సభలో మోడీని కౌగిలించుకున్న ఫొటోను కూడా ప్రధానంగా ప్రచురించిన సామ్నా.. రాహుల్ తమ మనసులు గెలుచుకున్నాడని రాసింది.

బీజేపీతో స్నేహంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే. తమకు ఏ పార్టీతో మితృత్వం లేదని.. ప్రజలే తమ మిత్రులని చెప్పారు. గతంలో బీజేపీకి బహిరంగంగానే మద్దతు ఇచ్చామని.. ఇప్పుడు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నామని చెప్పుకొచ్చారు. దేశానికి బీజేపీ ఏదో మంచి చేస్తుందని ఆనాడు మద్దతిచ్చామన్నారు ఉద్ధవ్ థాక్రే. మంచి జరిగితే పొగిడేవాళ్లమే కానీ… బీజేపీ హయాంలో ఒక్క మంచి పని కూడా జరగలేదని అందుకే  ఇప్పుడు ప్రశ్నిస్తున్నామన్నారు.

సాధారణంగా ప్రభుత్వంపై అపోజిషన్ పార్టీలు అవిశ్వాసం పెడతాయి. కానీ ఇప్పుడు అవిశ్వాసం పెట్టింది మొన్నటి వరకు బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీ. అంటే బీజేపీ మిత్ర పక్షమే ఇప్పుడు బీజేపీపై అవిశ్వాసం పెట్టింది. ఇలా దేశ చరిత్రలోనే మొదటిసారి జరిగి ఉంటుందన్నారు ఉద్ధవ్ థాక్రే. దీనిని బట్టి బీజేపీ విధానాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకొవచ్చంటున్నారు. ప్రజలపై దెబ్బ పడింది కాబట్టే మిత్ర పక్షాలు కూడా ఎదురు తిరగాల్సి వస్తోందన్నారు.

అంతేకాదు.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా సామ్నాలో ఓ ఆర్టికల్ రాశారు. అందులో బీజేపీ, కాంగ్రెస్ తీరుపై ఆయన విమర్శలుచేశారు. రాజకీయ లబ్దికోసం, ఓట్ల కోసం.. కులాలు, మతాలను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు.. ఒకరు ముస్లిం పురుషుల పార్టీ అని.. మరొకరు ముస్లిం మహిళల పార్టీ అని చెప్పుకుంటున్నారన్నారు. తమ స్వలాభం కోసం ముస్లింల ఇళ్లలో చిచ్చుపెట్టే వరకు వెళ్ళారని శివసేన అంటోంది. వాస్తవానికి ముస్లింలకు ఏం కావాలనే దానిపై మాత్రం ఎవరూ మాట్లాడటం లేదంటోంది. ఈ ఆర్టికల్ లో ఎక్కువ శాతం బీజేపీపైనే మండిపడ్డారు సంజయ్ రౌత్. ముస్లింలకు కావాల్సింది ఏంటీ..? వాళ్ల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే  విషయాన్ని పక్కన పెట్టేశారని బీజేపీపై ఫైరయ్యారు. మదర్సాల్లో దుస్తుల మార్పు నిర్ణయం, ఉత్తరప్రదే శ్ లో ముస్లింలకు ఇచ్చే సెలవులు రద్దు చేయడం వంటి నిర్ణయాలతో బీజేపీ స్టాండ్ ఏంటో అర్థమైతోందన్నారు.

ఇప్పటికిప్పుడు ఎన్డీఏ నుంచి శివసేన తప్పుకున్నా బీజీపీకి వచ్చిన ఇబ్బందేం లేదు. అయినా.. మరో పార్టీతో పొత్తుకు బీజేపీ రెడీ అవుతోందనే ప్రచారం నడుస్తోంది. బిజూ జనతాదళ్ తో బీజేపీ ఫ్రెండ్ షిప్ చేయబోతోందని చర్చ జరుగుతోంది. పార్టీ చీఫ్ నవీన్ పట్నాయక్ ఇటీవల కొన్ని సమయాల్లో మోడీ పాలనను పొగడటం ఈ వాదనలకు బలానిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates