ఫోన్ కోసం గ్యాంగ్ వార్ : ఒకరి మృతి

YTGఫోన్ కోసం స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఫోన్ దొంగిలించాడనే కోపంతో ముగ్గురు స్నేహితుల మధ్య తలెత్తిన ఘర్షణలో ఇద్దరు కలిసి తమ స్నేహితుడిని కొట్టి చంపిన ఘటన మంగళవారం(ఫిబ్రవరి20) అర్ధరాత్రి కలకలం రేపింది. సనత్‌నగర్‌ కు చెందిన రత్నాకర్‌రాజు(35), బీకేగూడ, సంజయ్‌గాంధీనగర్‌లకు చెందిన తీగుల నవీన్‌కుమార్‌(36), దాలవాయి పూర్ణ(34) లు స్నేహితులు. కొన్ని రోజుల క్రితం నవీన్‌కుమార్‌ ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడు. దీంతో పార్టీ చేసుకుందామని స్నేహితులు రత్నాకర్‌రాజు, పూర్ణలను తన రూమ్ కి పిలిచాడు. అర్ధరాత్రి వరకు ముగ్గురు మద్యం తాగారు. కొద్దిసేపటి తరువాత ఫోన్ కనిపించకపోవడంతో పూర్ణ ఫోన్ నుంచి తన నంబర్‌కు ఫోన్‌ చేశాడు నవీన్‌కుమార్‌. అయితే రత్నాకర్‌రాజు జేబులో ఫోన్ రింగ్ అవడంతో అతడే ఫోన్ దొంగిలించాడని కోపోద్రిక్తుడైన నవీన్‌కుమార్‌ ఘర్షణకు దిగాడు. రత్నాకర్‌రాజును తీవ్రంగా కొట్టాడు. పూర్ణ కూడా రత్నాకర్‌రాజును కొట్టాడు. దీంతో రత్నాకర్‌రాజు రోడ్డు మీదకు పరుగు తీశాడు. అతడిని వెంబడించిన నవీన్‌కుమార్‌, పూర్ణలు రోడ్డుపై కూడా రత్నాకర్‌రాజుపై దాడి చేయడంతో అక్కడికక్కడే తలకు తీవ్రగాయాలతో రత్నాకర్ రాజు మృతి చెందాడు. విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నవీన్‌కుమార్‌, పూర్ణలను బుధవారం(ఫిబ్రవరి21) పోలీసులు అరెస్టు చేశారు.

Posted in Uncategorized

Latest Updates