ఫ్రాన్స్ సంబురాల్లో ఘర్షణలు..ఇద్దరు మృతి


విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్…. 20 ఏళ్ల తర్వాత రెండో సారి సాకర్ కప్ ను సొంతం చేసుకుంది. దీంతో ఆ దేశ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పారిస్ వీధుల్లోకి వచ్చి మరీ సంబురాలు జరుపుకున్నారు. అయితే ఈ వేడుకల్లో విషాదం నెలకొంది. అభిమానుల సంబరాలు శృతి మించడంతో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. దీంతో రంగప్రవేశం చేసిన రియోట్‌ పోలీసులు వారిపై టియర్‌ గ్యాస్‌, వాటర్‌ గన్స్‌ లు ఉపయోగించి చెల్లా చెదురు చేశారు. అయితే ఈ ఘటనల్లో ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు.

క్రొయేషియాపై విక్టరీ సాధించిన తర్వాత లక్షల మంది అభిమానులు నిబంధనలకు విరుద్దంగా రోడ్లపైకి వచ్చి తమ జట్టు విజాయాన్ని ఆస్వాదిస్తూ సంబరాలు చేసుకున్నారు. తమ జట్టు విజయానికి సూచికగా వేలమంది అభిమానులు పిరమిడ్‌ రూపంలో నిలబడ్డారు. రోడ్లపై పాటలు పాడుతూ.. డ్యాన్స్‌లు చేశారు. మ్యాచ్‌ ముగిసిన వెంటనే ఓ 50 ఏళ్ల అభిమాని అత్యుత్సాహంగా కెనాల్‌పై నుంచి దూకడంతో మెడలు విరిగి మృతి చెందాడు. మరొక 30 ఏళ్ల అభిమాని విజయానందంలో కారు నడుపుతూ చెట్టుకు ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు.

ఇక మరో వైపు వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన అభిమానులు షాప్‌లపై దాడులు చేస్తూ ఆస్తుల ధ్వంసానికి ప్రయత్నించారని, దీంతో వారిని అడ్డుకోగా కవ్వింపు చర్యలకు పాల్గొన్నారని రియోట్‌ పోలీసులు తెలిపారు. అభిమానులు రాళ్లతో దాడిచేయడంతోనే తాము టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యాన్‌లు ఉపయోగించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఇక పోలీసులు దాడిలో చాలా మంది గాయపడ్డారు. సంతోషం కాస్త విషాదంగా మారడంతో పోలీసులు రవాణ వ్యవస్థను నిలిపివేశారు. రోడ్లపై ఎలాంటి వాహనాలు తిరగకుండా ఆంక్షలు విధించారు.

Posted in Uncategorized

Latest Updates