ఫ్రీ: గ్రామీణ రైల్వే స్టేషన్లలో వైఫై

free-wifiరైల్వే ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది రైల్వే శాఖ. ఇందులో భాగంగానే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గ్రామీణ రైల్వేస్టేషన్లలోనూ హైస్పీడ్‌ వైఫై వ్యవస్థ ఏర్పాటవుతోంది. ఇప్పటికే ఏ1, ఏ, బీ తరహా పెద్ద రైల్వేస్టేషన్లలో గూగుల్‌ సహాయంతో హైస్పీడ్‌ వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా రైల్వే అనుబంధ సంస్థ రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో గ్రామీణ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు.  కొద్ది రోజుల క్రితమే 45 గ్రామీణ స్టేషన్లలో హైస్పీడ్‌ వైఫై వ్యవస్థ ఏర్పాటు పూర్తయింది. సాధారణంగా ఇలాంటి వైఫైలను మొదటి అరగంటో, గంటనో ఫ్రీగా అందజేసి.. తర్వాత చార్జీ వసూలు చేసే పద్ధతి అమల్లో ఉంది. గ్రామీణ స్టేషన్లలో రైల్‌టెల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వైఫైని మాత్రం పూర్తి ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రతి గంటకోసారి లాగిన్‌ అవుతూ వినియోగించుకోవచ్చంటున్నారు.

ప్రధాని మోడీ డిజిటల్‌ ఇండియాపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలను అందులో భాగస్వామ్యం చేసిన క్రమంలో రైల్వే శాఖ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. దీంతో ఫ్రీగా వైఫైని అందుబాటులోకి తేవాలని..మొదట ఏ1, ఏ, బీ కేటగిరీ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏ1 స్టేషన్లుగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, తిరుపతిలలో.. ఏ కేటగిరీలో 31 స్టేషన్లలో గూగుల్‌ సంస్థ సహాయంతో ఉచిత వైఫై ఏర్పాటు చేశారు. బీ కేటగిరీలో 38 స్టేషన్లు ఉండగా.. ప్రస్తుతానికి కామారెడ్డి, నిడదవోలు స్టేషన్లలో ఏర్పాటు చేశారు.

ఏడాది చివరినాటికి మిగతా ప్రాంతాల్లో కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో గ్రామీణ స్టేషన్లపై దృష్టి సారించారు.

Posted in Uncategorized

Latest Updates