ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి జొకోవిచ్‌ అవుట్

NOVAKవరుస విజయాలతో అదరగొట్టిన సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ నుంచి అవుట్ అయ్యాడు. మంగళవారం(జూన్ -5) జరిగిన క్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ-72వ ర్యాంకర్‌ మార్కో సెచినాటో (ఇటలీ) అసాధారణ ప్రదర్శన కనబరిచి 3 గంటల 26 నిమిషాల్లో 6–3, 7–6 (7/4), 1–6, 7–6 (13/11)తో 20వ సీడ్‌ జొకోవిచ్‌ను బోల్తా కొట్టించి తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. ఈ గెలుపుతో 25 ఏళ్ల సెచినాటో తన కెరీర్‌లో మొదటి సారిగా ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. ఈ టోర్నీకి ముందు సెచినాటో తన కెరీర్‌లో ఇప్పటి వరకూ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.

2015 యూఎస్‌ ఓపెన్, 2016 ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్, 2017 వింబుల్డన్‌ టోర్నీల్లో మార్కో సెచినాటో తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. 1999లో ఆండ్రీ మెద్వదేవ్‌ (100వ ర్యాంక్‌) తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీస్‌కు చేరిన తక్కువ ర్యాంక్‌ ప్లేయర్‌గా సెచినాటో గుర్తింపు పొందాడు. అంతేకాకుండా 1978లో కొరాడో బారాజుటి తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన తొలి ఇటలీ క్రీడాకారుడిగా సెచినాటో రికార్డు సృష్టించాడు. సెమీఫైనల్లో ఏడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)తో సెచినాటో తలపడతాడు.

Posted in Uncategorized

Latest Updates