ఫ్రెంచ్ ఓపెన్ విజేత: సిమోన హలెప్

HALEPఅద్భుత ఫామ్‌ను కనబరుస్తున్నా గ్రాండ్‌స్లామ్స్‌లో ఫైనల్ పోరులో తడబడుతున్న వరల్డ్ నెంబర్వన్‌ సిమోన హలెప్‌ ఈసారి కళ్లు చెదిరే ఆటతీరును ప్రదర్శించింది. తద్వారా తన కల నెరవేర్చుకుంది. సరిగ్గా ఏడాది క్రితం టైటిల్‌ను మిస్సయిన దగ్గరే కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ను అందుకుంది.

శనివారం(జూన్-9) జరిగిన ఫైనల్లో 3-6, 6-4, 6-1 తేడాతో పదో సీడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) ఓడించి ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్‌గా నిలిచింది. 11 విన్నర్లు సాధించిన హలెప్‌ ఐదు సార్లు సర్వీస్‌ను బ్రేక్‌ చేసింది. అయితే తొలి సెట్‌లో మాత్రం స్టీఫెన్స్‌ అనూహ్యంగా చెలరేగింది. నాలుగో గేమ్‌లో హలెప్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేస్తూ స్టీఫెన్స్‌ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆ తర్వాత ఇద్దరు తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో 5-3తో నిలిచారు. తొమ్మిదో గేమ్‌ డ్యూస్‌ వరకు వెళ్లినా అడ్వాంటేజ్‌ సాధించిన స్టీఫెన్స్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటి సెట్‌ను 6-3తో ముగించింది. రెండో సెట్‌లో మాత్రం హలెప్‌ చెలరేగింది. తొలి గేమ్‌లోనే సర్వీస్‌ కోల్పోయి 0-2తో వెనకబడిన దశలో పుంజుకున్న తీరు అద్భుతం. ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేస్తూ వరుసగా నాలుగు గేమ్‌లు దక్కించుకుని 4-2తో టాప్‌లో నిలిచింది. కానీ ఏడో గేమ్‌లో అద్భుతంగా ఆడిన స్టీఫెన్స్‌ బ్రేక్‌ పాయింట్‌తో 3-4తో సవాల్‌ విసిరింది. ఆ తర్వాత కూడా ఆమె తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో స్కోరు 4-4తో సమమైంది. అయితే పదో గేమ్‌లో హలెప్‌ విజృంభించడంతో స్టీఫెన్స్‌ తన సర్వీస్‌ను కోల్పోవడమే కాకుండా సెట్‌ను కూడా చేజార్చుకుంది. దీంతో ప్రత్యర్థి సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్‌ చేస్తూ 5-0తో నిలిచింది హలెప్‌. ఆరో గేమ్‌ను స్టీఫెన్స్‌ నెగ్గినా హలెప్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ విజయాన్ని అడ్డుకోలేకపోయింది.

 

 

Posted in Uncategorized

Latest Updates