ఫ్రెండ్లీ పోలీసింగ్: రాష్ట్ర వ్యాప్తంగా బీట్ పెట్రోలింగ్ వ్యవస్థ

policeభద్రతా చర్యలో భాగంగా పోలీసు ఉన్నతాధికారులు మరిన్ని కట్టుదిట్టమైన ప్రణాళికలు చేపడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ఇప్పటికే ప్రజలకు భరసా కల్పిస్తున్న పోలీసులు వారికి మరింత చేరువయ్యేలా… రాష్ట్ర వ్యాప్తంగా బీట్ పెట్రోలింగ్ వ్యవస్థను రూపొందిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ఉన్న బీట్‌ పెట్రోలింగ్‌ వ్యవస్థను రాష్ట్రంలో  కొత్తగా ఏర్పడ్డ కమిషనరేట్లు, పాత, కొత్త జిల్లా కేంద్రాల్లో అమలు చేసేలా విస్తృ త కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఒక్కో స్టేషన్ కింద ఆరు నుంచి ఏడు బీట్లుగా పోలీస్‌ సిబ్బందిని నియమించి.. వారికి బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్‌ వాహనాలు అందించారు. దీంతో సిబ్బందికి కేటాయించిన బీట్లలో జరిగే ప్రతిచిన్న విషయం త్వరగా తెలిసిపోవడంతో పాటు ఘటనా స్థలాల కు చేరుకోవడం ఈజీ అవుతుంది. అలాగే బీట్‌ పోలీసింగ్‌ ద్వారా నేరాలను అరికట్టడం జరుగుతుంది. ఇదే తరహాలో జిల్లాలు, కొత్త కమిషనరేట్లలోనూ బీట్‌ పోలీసింగ్‌ను అమలుచేసేందుకు పోలీసుశాఖ కసరత్తు చేస్తోంది.

కొత్త కమిషనరేట్లలోనూ పెట్రోలింగ్‌ కోసం ఇన్నోవా కార్ల కొనుగోలుకు పోలీస్‌ శాఖ సన్నాహాలు చేస్తోంది. కొత్తగా ఏర్పడిన కమిషనరేట్లలో ప్రతీ పోలీస్ స్టేషన్ కు రెండు చొప్పున పెట్రోలింగ్‌ కార్లు, 8 చొప్పున బ్లూకోల్ట్స్‌ బైకులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రూరల్‌ ప్రాంతాల్లో ఒక్కో ఠాణాకు ఒక పెట్రోలింగ్‌ కారుతో పాటు నాలుగు బ్లూకోల్ట్స్‌ బైకులు అందజేయనుంది. తద్వారా బీట్స్‌లో ఉండే కానిస్టేబుళ్లు గస్తీ చేపట్టడంతోపాటు     ఘటనా స్థలాలకు చేరుకోవడం సులభంగా ఉంటుందని భావిస్తోంది.

అంతేకాదు టెక్నాలజీ ఉపయోగించుకోవాలని పోలీస్‌ శాఖ కార్యాచరణ రూపొందించింది. ప్రతి చిన్న ఘటన నిమిషాల్లో ఉన్నతాధికారులకు తెలిసేలా యాప్స్‌తో అప్‌డేట్‌ చేయనున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ కు ఓ ఫేస్‌బుక్‌ ఖాతా తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Posted in Uncategorized

Latest Updates