బంగ్లాదేశ్ లో సంచలన తీర్పు.. ప్రధాని హత్యాయత్నం కేసులో 19మందికి ఉరి

బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాపై మర్డర్ అటెంప్ట్ కేసులో 19 మందికి ఉరిశిక్ష పడింది. 2004లో ఢాకా ఎన్నికల ప్రచార సభలో జరిగిన గ్రెనేడ్‌ దాడి కేసులో ఇద్దరు బంగ్లాదేశ్‌ మాజీ మంత్రులు సహా 19 మందికి ఉరిశిక్ష విధిస్తూ… ఆ దేశ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా రుజువైనవారికి భూమ్మీద జీవించే హక్కులేదంటూ జస్టిస్‌ షాహెద్‌ నూరుద్దీన్‌ ఉద్వేగంతో తీర్పు చెప్పారు. మాజీ హోంమంత్రి బాబర్, విద్యాశాఖ మాజీ డిప్యూటీ మంత్రి అబ్దుస్ సలాం పిటూం సహా మొత్తం 19 మందికి ఉరిశిక్ష పడింది. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్ పర్సన్ ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రహ్మాన్ తోపాటు 18 మందికి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. మరో 11 మందికి వివిధ స్థాయిల్లో జైలు శిక్షలు విధించారు.

2004, ఆగస్టు21న ఢాకాలో ప్రధానమంత్రి షేక్ హసీనా పాల్గొన్న అవామీ లీగ్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో గ్రెనేడ్‌ దాడి జరిగింది. ఈ దాడిలో 20 మంది మృతి చెందారు. 500 మందికి పైగా గాయపడ్డారు. షేక్‌ హసీనాను టార్గెట్‌ చేస్తూ గ్రేనేడ్‌ దాడి జరిగింది. ఆమె గాయాలతో తప్పించుకున్నారు. బీఎన్‌పీ, జమాత్‌ ఎ ఇస్లామి కూటమికి చెందిన సభ్యులే ఈ ఘాతుకానికి కుట్ర పన్నినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మరణ శిక్ష ఖరారైన వారిలో సైన్యానికి చెందిన మాజీ నిఘా అధికారులు కూడా ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుడు తారిఖ్ రహ్మన్ ప్రస్తుతం లండన్ లో ఉంటున్నట్టు సమాచారం.

Posted in Uncategorized

Latest Updates