బంపర్ ఆఫర్: ఆస్తి పన్నుముందే చెల్లిస్తే 5% రాయితీ

property-taxఆస్తి పన్ను చెల్లించేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది మున్సిపల్ శాఖ. ముందుగా చెల్లించే వారికి 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నెల(ఏప్రిల్) 30లోపు పన్ను చెల్లించే వారికి ఈ రిబేట్‌ వర్తింపజేస్తామంది. GHMCలో ఇప్పటికే రిబేట్‌ను అమలు చేస్తుండగా..ఇకపై రాష్ట్రంలోని 73 మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ వర్తింపజేయాలని అధికారులను ఆదేశించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఆస్తి పన్నుల వసూళ్లతో ఆదాయం పెరిగితే అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండదని మున్సిపాలిటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రిబేట్‌పై విస్తృత ప్రచారం కల్పించి వసూళ్లు ప్రోత్సహించాలని మున్సిపల్‌ కమిషనర్లను కోరింది. గడువులోగా చెల్లించని ఆస్తి పన్నుల బకాయిలపై పెనాల్టీలు విధించడం.. తర్వాత మిగిలిన బకాయిలను రాబట్టుకోడానికి మళ్లీ కొత్త గడువు విధించి ఆలోపు చెల్లిస్తే పెనాల్టీలు మాఫీ చేయడం కొన్నేళ్లుగా అనవాయితీగా వస్తోంది. దీంతో సకాలంలో పన్ను చెల్లింపులు ప్రోత్సహించేందుకు 2016-17 నుంచి జరిమానాల మున్సిపల్ శాఖ స్వస్తి పలికింది.

GHMC మినహా రాష్ట్రంలోని మిగిలిన 73 పురపాలికల్లో ఆస్తి పన్ను ఎగవేసిన టాప్‌-100 మంది లిస్టును మున్సిపల్ శాఖ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. కమర్షియల్‌ ఆస్తులకు సంబంధించి ఏళ్లుగా చెల్లించని మొండి బకాయిలు రూ.కోట్లకు ఎగబాకడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వసూళ్ల కోసం పలు మార్లు నోటిసులిచ్చినా లాభం లేకపోవడంతో ‘నేమ్‌ అండ్‌ షేమ్‌’పద్ధతిలో ఎగవేతదారుల పేర్లు బహిర్గతం చేసేందుకు ఆ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దీంతో ఎగవేతదారులు పన్నులు చెల్లించేందుకు ముందుకొస్తారని ఈ నిర్ణయం తీసుకున్నామని పురపాలక శాఖ అధికారులు తెలిపారు. ఆస్తి పన్నులు ఎగవేస్తే సంబంధిత వ్యక్తుల ఆస్తులు జప్తు చేసే అధికారం మున్సిపాలిటీలకు ఉందన్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates