బడ్జెట్ పై ఏపీ ఎంపీల ఆందోళన.. పార్లమెంట్ వాయిదా

TDPలోక్ సభలో మంగళవారం (ఫిబ్రవరి-6) ఆందోళన చేశారు ఏపీ ఎంపీలు. బడ్జెట్ లో నిధులు, విభజన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. విభజన చట్టంలో తెలిపిన విధంగా ఏపీకి న్యాయం చేయాలన్నారు. టీడీపీ సభ్యుల నిరసనతో సభ కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. దీంతో స్పీకర్ సభను మొదట 15 నిమిషాలు వాయిదా వేశారు. తర్వాత కూడా సభలో సభ్యుల ఆందోళన కొనసాగింది.

రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేశాయి. పెట్రోల్ , డీజిల్ రేట్ల పెంపుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభలో నిరసన తెలిపారు. చైర్మన్ పర్మిషన్ లేకుండా మాట్లాడటం , గొడవ చేయడం సరికాదని సభాపతి వెంకయ్య చెప్పినా టీఎంసీ ఎంపీలు వినలేదు. గందరగోళం మధ్య సభను రెండు గంటలకు వాయిదా వేశారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య.

ఎంపీల నిరసనలు

బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందంటూ ఢిల్లీలో నిరసన తెలిపారు ఏపీ టీడీపీ ఎంపీలు. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఆందోళన తెలిపారు. ఎంపీ శివప్రసాద్ చిడతలు వాయిస్తూ… న్యాయం చేయాలని కోరారు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ.. ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. విభజటన చట్టంలో చెప్పినట్టుగా ఏపీకి న్యాయం చేయాలని కోరారు. పొత్తు ధర్మాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. మరోవైపు… ప్రధానమంత్రి నరేంద్రమోడీతో.. కేంద్రమంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యారు. విభజన హామీలు, బడ్జెట్ కేటాయింపులపై చర్చించారు. ఏపీకి ఎలాగైనా న్యాయం చేయాలని సుజనా చౌదరి.. ప్రధానిని కోరినట్టు తెలిసింది.
విభజన హామీల అమలు కోసం పార్లమెంట్ ముందు నిరసనకు దిగారు ఏపీ వైసీపీ ఎంపీలు. సెషన్ ప్రారంభానికి ముందే ఎంపీలంతా ప్లకార్డులు చూపిస్తూ నినాదాలు చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం నిధులు, ప్రాజెక్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates