బరువు మించితే…ఆరు రెట్ల జరిమానా

Luggageభారీ ఎత్తున లగేజీని తీస్కెళ్లే ప్రయాణికులకు రైల్వేశాఖ షాక్ ఇవ్వనుంది. ఎలాంటి అడ్డూఅదుపు లేకుండా కంపార్ట్ మెంట్లలో కొందరు ప్రయాణికులు సామాన్లతో నింపేస్తుండటంతో ప్రయాణికులు రైల్వే శాఖకు ఫిర్యాలు చేశారు. దీంతో పాత నిబంధనలను కచ్చితంగా అమలు జరపాలని నిర్ణయించింది. ప్రయాణికుల లగేజీకి సంబంధించి రైల్వేశాఖ 30 ఏళ్ల క్రితమే నిబంధనలను రూపొందించింది. అయితే వాటిని పూర్తిస్థాయిలో ఎక్కడా అమలు జరుపలేదు. ఆ నిబంధనల ప్రకారం.. స్లీపర్ క్లాస్‌లో 40కిలోలు, సెకండ్ క్లాస్‌లో 35కిలోలు, ఏసీ ప్రయాణికుడు 50కిలోల వరకు ఒక్కో ప్రయాణికుడు లగేజీని ఎలాంటి చార్జీలేవీ లేకుండానే తీసుకెళ్లవచ్చు. నిర్ణయించిన చార్జీలు చెల్లిస్తే స్లీపర్ క్లాస్‌లో 80కిలోల వరకు, సెకండ్ క్లాస్‌లో 70కిలోల వరకు, ఏసీ బోగీలో 100 కిలోల వరకు లగేజీని అనుమతిస్తారు. అయితే ఈ అధిక లగేజీని ముందుగానే తూకం వేయించి బిల్లు తీసుకోవాలి.

అందుకు 1.5రెట్ల అదనపు చార్జీని రైల్వేశాఖ వసూలు చేస్తుంది. దానికితోడు ఈ అదనపు లగేజీని ప్రయాణించే బోగీలో కాకుండా.. లగేజీ బోగీలోనే ఉంచాలి. అదనపు లగేజీకి తగిన రసీదు లేకుండా ప్రయాణిస్తే.. ఆ చార్జీ మొత్తానికి ఆరురెట్లు జరిమానాను విధించే అవకాశముంది. ఉదాహరణకు 80కిలోల బరువుతో స్లీపర్‌క్లాస్‌లో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే, అదనంగా ఉన్న 40కిలోలకు లగేజీ చార్జీ కింద రూ.109 చెల్లించాలి. ఒకవేళ ఎలాంటి రుసుము చెల్లించకుండానే అదనపు లగేజీని వెంట తీసుకెళ్తూ పట్టుబడితే రూ.654 జరిమానా కట్టాలి. ఇకపై ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని..రూల్స్ ఉల్లంఘిస్తే జరిమానా విధించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.

 

Posted in Uncategorized

Latest Updates