బర్మింగ్ హోమ్ టెస్ట్ : ఇంగ్లాండ్ ఆలౌట్

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన‍్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 180 పరుగుల వద్ద ఆలౌటైంది. 9/1 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటలో శుక్రవారం  (ఆగస్టు-3)రెండో  ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ మరో 171 పరుగులు జోడించి మిగతా తొమ్మిది వికెట్లను కోల్పోయింది.

దాంతో టీమిండియాకు 194 పరుగుల సాధారణ లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ఏ దశలోనూ ఇంగ్లండ్‌ను తేరుకోనివ్వని టీమిండియా బౌలింగ్‌ విభాగం పదునైన బంతులతో చెలరేగింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను ముందుగా అశ్విన్‌ దెబ్బ కొడితే, ఆపై ఇషాంత్‌ శర్మ వైవిధ్యమైన బంతులతో విజృంభించాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో సామ్‌ కుర్రాన్‌(63;65 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు రెండొందల మార్కును దాటలేకపోయింది. భారత బౌలర్లలో ఇషాంత్‌ శర్మ ఐదు వికెట్లతో ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించగా,  రవి చంద్రన్‌ అశ్విన్‌ మూడు వికెట్లతో మెరిశాడు. ఇక ఉమేశ్‌ యాదవ్‌ కు రెండు వికెట్లు లభించాయి. శుక్రవారం(ఆగస్టు-3) ఆటలో ఓవర్‌ నైట్‌ ఆటగాడు కీటన్‌ జెన్నింగ్స్‌(8) ఆదిలోనే పెవిలియన్‌ కు చేరగా, ఆపై ఇంగ్లండ్‌ స్వల విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది.

జో రూట్‌(14), మలాన్‌(20), బెయిర్‌ స్టో(28), స్టోక్స్‌(6), బట్లర్‌(1) ఇలా ప్రధాన ఆటగాళ్లు నిరాశపరచగా, బౌలర్‌ కుర్రాన్‌ మాత్రం పోరాట స్ఫూర్తిని కనబరుస్తూ హాఫ్‌ సెంచరీ సాధించాడు. తన కెరీర్‌లో రెండో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న కుర్రాన్‌ తొలి అర్థ శతకాన్ని సాధించడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 287 పరుగులకు ఆలౌట్‌ కాగా, భారత్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 274 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates