బల్దియా.. ఇదేందయా!

 హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ-జీహెచ్‌ఎంసీ సిటీ పాలనకు గుండెకాయ. ఆడ్మినిస్ట్రేషన్‌ నుంచి సానిటేషన్‌ వరకు, బడ్జెట్‌ నుంచి భారీ ప్రాజెక్టుల నిర్మాణం వరకు అంతా తానై నడిపిస్తుంది. చెత్త తొలగింపు, నిర్వహణ బాధ్యత బల్దియాదే. పౌరుల్లో చైతన్యం కలిగించి స్వచ్ఛతను పాటించేలా ప్రోత్సహిస్తూ ఉంటుంది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తోంది. ఈ అధికారులు నగరంలో పర్యటించి అంతా బాగుండాలని, రూల్స్‌ పాటించాలని సూక్తులు చెబుతూ ఉంటారు. కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత మర్చిపోతున్నారు. ఆచరణ తర్వాతే ఆదేశాలిస్తే పాటించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది.ఇదంతా ఎందుకంటే..జీహెచ్‌ఎంసీ హెడ్డాఫీస్ అలా ఉంది మరి. ఈ బిల్డింగ్‌ చక్కదనాన్ని చూస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం.

ఆఫీసా..స్టో ర్‌ రూమా?
స్వచ్ఛ సర్వేక్షణ్‌–2019 పై బల్దియా ప్రత్యేక దృష్టి పెట్టింది. నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు జోనల్ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, ట్రాన్స్ పోర్ట్‌, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్లు కృషి చేయాలని కమిషనర్‌ దానకిశోర్‌ కోరుతున్నారు. అధికారులు కూడాఫీల్డ్ లో పర్యటిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి స్వయంగా కమిషనర్‌ దానకిశోర్‌ నగరాన్ని చెక్‌ చేస్తున్నారు. పబ్లిక్‌ టాయ్ లెట్లు, రోడ్లు, ఫుట్‌పాత్లు తనిఖీ చేసి రూల్స్‌ పాటించని వారికి ఫైన్స్‌ వేస్తున్నారు. రోడ్లను పాడుచేస్తున్న హోటళ్లను సీజ్‌ చేస్తున్నారు.

సిటీని శుభ్రంగా ఉంచాలంటే నగరపాలక సంస్థ ఒక్కటి పని చేస్తేనే కాదు, నగర వాసులు కూడా స్వచ్ఛందంగా ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. కానీ పాలక సంస్థ కూడా పాటించాలనే విషయాన్ని మర్చిపోయారు కమిషనర్‌. బల్దియా హెడ్డ్ ఆఫీస్‌ ఏడంతస్తు్ల్లో ఉంటుంది. సుమారు 3 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆరు అంతస్తుల్లో ఒక్కో ఫ్లోర్లో వివిధ శాఖల ఛాంబర్లు, ఏడో ఫ్లో ర్లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఉంటుంది. అధికారుల స్థాయి ప్రకారం వారికి ప్రత్యేక ఛాంబర్ లు ఉంటాయి. ఉద్యోగులు డిపార్ట్‌మెంట్‌లలో డ్యూటీలు చేస్తుంటారు. మేయర్‌, కమిషనర్‌ ఛాంబర్లు మొదటి ఫ్లోర్లో ఉంటాయి. వీరి ఆఫీసులు చాలా నీట్‌గా, సాఫ్ట్‌వేర్‌ ఆఫీసుల్లా మెరిసిపోతుంటాయి. చక్కని ఫ్లోర్‌ డిజైన్‌, గోడలపై అలంకరణలు, పూల మొక్కలతో ఎంత చక్కగా ఉన్నాయో అనిపిస్తుంది.

రెండో ఫ్లోర్‌ నుంచి ఒక్కో ఫ్లోర్‌ ఎక్కుతూ పోతుంటే చెత్తా చెదారమే కనిపిస్తుంది. ఏ గోడపై చూసినా పాన్‌, గుట్కా మరకలే స్వాగతం పలుకుతాయి. కొందరు ఉద్యోగు లైతే ఎప్పుడూ ఏదో ఒకటి నములుతూ ఉమ్ముతూనే ఉంటారు. ఐఏఎస్‌ అధికారుల ఛాంబర్ ల పక్కన కూడా ఉమ్మేస్తున్నారు. ఆ దారిలో వెళ్లే అధికారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఎలాగో తుడిచేందుకు, ఊడ్చేందుకు పారిశుధ్య కార్మికులు ఉన్నారు కదాని ఇష్టమున్నట్టు చేస్తున్నారు. ఇక బల్దియా ఆవరణలో కూడా ఇదే దుస్థితి. భూతద్దం పెట్టి వెతికినా క్లీన్‌గా కనిపించదు.

Posted in Uncategorized

Latest Updates